
కామారెడ్డి టౌన్: వైద్య కళాశాల పనులపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పూర్తి చేయించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న 9 వైద్య కళాశాలల పనుల పురోగతిపై మంగళవారం ఆయన టీఎస్‌ఎంఐడీసీ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కామారెడ్డితో పాటు కరీంనగర్, జనగామ, వికారాబాద్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలలో నూతన వైద్య కళాశాల పనుల జరుగుతున్నాయన్నారు. ఈ కళాశాలల పనులను జాతీయ వైద్య కమిషన్ పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తుందని, రాష్ట్రంలో ఇప్పటికే 6 వైద్య కళాశాలల పనులను పరిశీలించిందని వివరించారు. జూలై నుంచి మొదటి విడత అడ్మిషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైద్య కళాశాలలను సన్నద్ధం చేసి ఎన్‌ఎంసీ నుంచి అనుమతి సాధించాలని మంత్రి ఆదేశించారు. వైద్య కళాశాల విద్యార్థుల కోసం హాస్టల్ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను పరిశీలించి, అక్కడ అవసరమైన మరమ్మతులు చేయించాలని సూచించారు. వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన బెడ్ల సంఖ్యను జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా నిర్మించాలని, ఆ పనులు త్వరితగతిన పూర్తి కావాలని ఆదేశించారు. ఆరోగ్య మహిళ కేంద్రాల సేవలను విస్తృతం చేయాలన్నారు. కంటి వెలుగును కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సీపీఆర్‌పై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో టీఫా స్కానింగ్ యంత్రం అందుబాటులో ఉంచామని, దీనిపై గర్భిణులలో విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.
జిల్లాలో ఆరోగ్య మహిళ కార్యక్రమంపై దృష్టి పెట్టినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఎర్రాపహాడ్, డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మహిళలకు 8 రకాల పరీక్షలు చేస్తున్నామన్నారు. కంటి వెలుగు ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 2,48541 మందికి పరీక్షలు చేశామని, 39,171 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, కామారెడ్డి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పెరుగు వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌ఎంసీ అనుమతులు సాధించాలి
వీసీలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశం