
బిచ్కుంద మార్కెట్ యార్డులో తూకం వేసిన శనగ బస్తాలు
బిచ్కుంద(జుక్కల్): మండలకేంద్రంలోని మార్కెట్ యార్డులో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. శనగ పంటను సాగుచేసిన రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. రైతు సహకార సంఘం ద్వారా కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేసి తూకం వేస్తున్నారు. ఇప్పటివరకు 12 వేల బస్తాల (సుమారు 6వేల క్వింటాలు) శనగలు తూకం వేశారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. తూకం వేసిన శనగలను తీసుకెళ్లడానికి 15 రోజుల నుంచి లారీలు రాకపోవడంతో కేంద్రం వద్ద రైతులు రాత్రి పగలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. లారీలు ఎప్పుడు వస్తాయన్న దానిపై మార్క్‌ఫెడ్ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. రేపు మాపు వస్తాయంటూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఒక్కో రైతు నుంచి 25 క్వింటాళ్లు..
రైతుల నుంచి శనగలను కొనుగోలు చేయడానికి అధికారులు నిబంధనలు విధించారు. ఒక రైతు నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఒక ఎకరానికి సగటున 7 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు సుమారు 30 క్వింటాళ్లపైనే దిగుబడి వస్తుంది. కానీ అధికారులు 25 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మిగతా శనగలను ఎక్కడికి తీసుకెళ్లి విక్రయించుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ప్రభుత్వ ధర కంటే రూ.12 వందలు తక్కువ పలుకుతోందని పేర్కొంటున్నారు. ఇప్పటికే పెట్టుబడి పెరిగి సతమతమవుతుంటే అధికారులు కొనుగోళ్లలో నిబంధనలు పెట్టి ఇబ్బందులు గురి చేయడం ఎంతవరకు భావ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, ప్రజా ప్రతినిధులు స్పందించి మార్క్‌ఫెడ్ అధికారులతో మాట్లాడి నిబంధనలు తొలగించి రైతులనుంచి పూర్తిస్థాయిలో పంటను కొనుగోలు చేసేలా చూడాలని, కాంటా వేసిన శనగలను ఎప్పటికప్పుడు ప్రతిరోజు లారీలలో తరలించాలని కోరుతున్నారు.
15 రోజులుగా శనగ కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు
పట్టించుకోని మార్క్‌ఫెడ్ అధికారులు
14వేల ఎకరాల్లో సాగు..
బిచ్కుంద మండలంలో 14,332ఎకరాలు శన గ సాగు అయ్యింది. ఎకరానికి 5నుంచి 7 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఒక్క మండలం నుంచి 65 వేలు క్వింటాలు శనగలు కొనుగోలు కేంద్రానికి విక్రయించడానికి వస్తాయని అధికారులు అంచనాలు వేశారు. నేటికి 6 వేలు క్వింటాలు కొనుగోలు చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యట న సందర్భంగా రైతులు నిరసనలు, ధర్నాలు చేస్తారనే భయంతో రెండు రోజుల క్రితం మార్క్‌ఫెడ్ అధికారులు 12వేల బస్తాలు సిద్ధంగా ఉంటే ఐదు లారీలు పంపించి కేవలం 16వందల బస్తాలు మాత్రమే తీసుకెళ్లారు. పది రోజుల నుంచి లారీల కోసం రైతులు కేంద్రం వద్ద నిరీక్షిస్తున్నారు. ఫోన్‌లు చేసిన తమకేమి పట్టనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పది రోజులుగా..
తూకం వేసి పది రోజులు అవుతోంది. లారీలలో నింపే వరకు శనగల బాధ్యత రైతులదేనని కేంద్రం నిర్వాహకులు అంటున్నారు. లారీలు రాకపోవడంతో ఇక్కడే నిరీక్షిస్తున్నాం. రైతుల గురించి పట్టించుకునే వారు లేరు. – మట్టి సంజీవ్, రైతు బిచ్కుంద
కాపలా ఉంటున్నాం
మార్కెట్ యార్డుకు శనగ తీసుకొచ్చి ఇరవై రోజులైంది. కాంటా చేసి ఉంచాం. లారీల రాక కోసం ఎదురుచూస్తున్నాం. రాత్రి పగలు బస్తాల వద్ద కాపలా కాస్తున్నాం. అధికారులు లారీలను పంపించి శనగలు తీసుకెళ్లాలి. –అశోక్, రైతు, బిచ్కుంద

కేంద్రంలో పేరుకుపోయిన శనగ బస్తాలు