పల్లెవించని పాలన | - | Sakshi
Sakshi News home page

పల్లెవించని పాలన

May 31 2026 12:24 AM | Updated on May 31 2026 12:24 AM

పంచాయతీ ఎన్నికలు జరపని సర్కారు

ప్రత్యేకాధికారుల పాలనతో ఇబ్బందులు

సమస్యలతో గ్రామీణులు సతమతం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రెండేళ్ల చంద్రబాబు సర్కారు పాలనపై దాదాపు అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతోంది. దీంతో, పాలక వర్గాల పదవీ కాలం ముగిసి 2 నెలలు దాటిపోయినా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సాహసం చేయలేకపోతోంది. పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన తీసుకు వచ్చింది. మండల కేంద్రాల్లో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఒక్కో అధికారికి రెండు మూడు గ్రామ పంచాయతీలు సైతం అప్పగించారు. ఇప్పటికే శాఖా పరమైన పనులతో సతమతమవుతున్న వారికి.. అద నంగా అప్పజెప్పిన పల్లె పాలనపై దృష్టి సారించే వీలు చిక్కడం లేదు. ఫలితంగా ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

తప్పని ప్రదక్షిణలు

పాలక వర్గాలు లేకపోవడంతో గ్రామ పంచాయతీల్లో ఏ చిన్న పనికై నా గ్రామ కార్యదర్శికే బాధ్యత ఉంటోంది. అయితే, గ్రామ సర్పంచ్‌లకుండే చెక్‌పవర్‌, సీఎంఎఫ్‌ఎస్‌ లాగిన్‌ను ప్రభుత్వం ప్రత్యేకాధికారులకు అప్పగించింది. ఫలితంగా కార్యదర్శులు చిన్నచిన్న పనులకు బిల్లులు, చెక్కులు తీసుకుని మండల కేంద్రా ల్లో ఉంటున్న ప్రత్యేకాధికారుల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. వారు అందుబాటులో లేకపోతే కాళ్లరిగేలా ప్రదక్షిణలు తప్పడం లేదు. పంచాయతీలో నిధులున్నా ప్ర త్యేకాధికారులు సకాలంలో ఆమోదం తెలియజేయకపోవడంతో ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తోందని కార్యదర్శులు వాపోతున్నారు. ఏదైనా పనిపై వెళ్తే రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. చివరకు రూ.100 ఖర్చు చేయాలన్నా ప్రత్యేకాధికారి వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్థిక పరిపుష్టి కలిగిన గ్రేడ్‌–1 (మేజర్‌) గ్రామ పంచాయతీలు సొంత నిధులతో నెట్టుకొస్తున్నాయి. గ్రేడ్‌–2, గ్రేడ్‌–3 కేటగిరీల్లోని చిన్న పంచాయతీల్లో కనీసం డ్రైన్లు, మంచినీటి ట్యాంకులు, పైపులైన్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులు కూడా చేయలేకపోతున్నామని కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. స్థానికులు పదేపదే తమ దృష్టికి వివిధ సమస్యలు తెస్తున్నా ఏమీ చేయలేక వారు చేతులెత్తేస్తున్నారు. మరోవైపు ప్రతి చిన్న సమస్యకు మండల కేంద్రాలకు వెళ్లడం భారంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు.

కొన్ని సమస్యలివిగో..

● ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైపులైన్లు దెబ్బ తిన్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. అమీనాబాద్‌, నాగులాపల్లి తదితర గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారు.

● ఇదే మండలం యండపల్లిలో విద్యుత్‌ లో ఓల్టేజీ సమస్యకు పరిష్కారమే లభించడం లేదు. దీనిని నిరసిస్తూ అక్కడి ప్రజలు కొత్తపల్లి సబ్‌ స్టేషన్‌ను ముట్టడించారు.

● కరప మండలం సిరిపురంలో ఇటీవల మంచినీటి మోటార్‌ కాలిపోయింది. పంచాయతీలో నిధులు లేకపోవడంతో స్థానికంగా యువకులు చందాలు వేసుకుని మరమ్మతులు చేయించాల్సి వచ్చింది.

● జగ్గంపేట, గండేపల్లి, పిఠాపురం, కరప తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో, పారిశుధ్య పరిస్థితులు దిగజారాయి.

కార్యదర్శుల పైనే భారం

పాలక వర్గాలున్నప్పుడు పంచాయతీ నిధులు, రాబడి మాటెలా ఉన్నా ప్రజా వ్యతిరేకతకు భయపడి సర్పంచులు, వార్డు సభ్యులు సొంత నిధులు వెచ్చించే వారు. తరువాత వచ్చే బిల్లులు డ్రా చేసుకుని సర్దుబాటు చేసుకునే వారు. ఇప్పుడు పాలక వర్గాలు లేకపోవడంతో పాలన భారమంతా కార్యదర్శుల పైనే పడింది. మూడు నెలల వేతన బకాయిలు చెల్లించకపోతే పని చేయబోమని పారిశుధ్య కార్మికులు చెప్తే.. ఒక్కొక్కరికి రూ.వెయ్యి, రూ.2 వేలు చేతిలో పెట్టి ప్రస్తుతానికి సరిపెట్టుకోండంటూ వారు బుజ్జగిస్తున్న పరిస్థితి. మంచినీటి పైపులైన్ల మరమ్మతులు, బ్లీచింగ్‌, ఫినాయిల్‌ తదితర అవసరాలకు సొంత సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోంది. చిన్న పంచాయతీలకు స్వల్ప ఖర్చులతో బయట పడుతున్నారు. కానీ, గ్రేడ్‌–1 పంచాయతీలకు ప్రతి నెలా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ ఖర్చవుతోంది. కొన్ని సందర్భాల్లో వడ్డీకి అప్పులు తెచ్చి మరీ ఖర్చు పెట్టాల్సి వస్తోందని కార్యదర్శులు వాపోతున్నారు. రెండు నెలలుగా జీతం సొమ్ము ఇంటికి తీసుకెళ్లిన పరిస్థితి లేకుండా పోయిందని కరప మండలంలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పంచాయతీ కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలో గ్రామ పంచాయతీలు

గ్రేడ్‌–1 76

గ్రేడ్‌–2 70

గ్రేడ్‌–3 80

గ్రేడ్‌–4 39

గ్రేడ్‌–4 (అడిషనల్‌) 30

గ్రేడ్‌–5 (500 జనాభా మినహా) 89

500 కంటే తక్కువ జనాభా 1

మొత్తం 385

ఒరిగిందేమీ లేదు

ప్రత్యేకాధికారులతో గ్రామాలకు ఒరిగిందేమీ లేదు. వారు గ్రామాల్లో అడపాదడపా కనిపిస్తున్నారు. ప్రజల కనీస సమస్యలు కూడా గుర్తించడం లేదు. గ్రామ కార్యదర్శులు వీధులను శుభ్రం చేయించడం, డ్రైన్లలో చెత్త తీయించడంతో సరిపెట్టేస్తున్నారు. ఏదైనా సమస్య చెప్తే నిధుల్లేవు, కొత్త పాలకవర్గం రావాలని అంటున్నారు. గ్రామాల్లో పాలన పడకేసింది.

– చింతా బుజ్జి, పెదకొత్తూరు, కరప మండలం

తాగునీటి సమస్యకు పరిష్కారమే లేదు

కుళాయిల నుంచి తాగునీరు సక్రమంగా రావడం లేదు. వారంలో రెండు మూడు రోజులు వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది. ఒకవేళ వచ్చినా అది మురికి నీటితో కలుషితమై వస్తోంది. గత్యంతరం లేక ప్రైవేటు వాటర్‌ ప్లాంట్ల నుంచే నీరు తెచ్చుకుంటున్నాం. ఈ సమస్యపై గ్రామ, మండల అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదు. ప్రత్యేకాధికారుల పాలన అంటే ఇదా?

– ఆలపు సుధారాణి, ఎండపల్లి, ఉప్పాడ కొత్తపల్లి మండలం

Advertisement
 
Advertisement
Advertisement