● వైఎస్సార్ సీపీ నేత దవులూరి దొరబాబు
● రామేశం మెట్టపై పేదలకిచ్చిన
స్థలాల పరిశీలన
సామర్లకోట: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తే ప్రజా ఉద్యమం చేస్తామని వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు హెచ్చరించారు. పెద్దాపురం మండలంలోని 12 గ్రామాలకు చెందిన 2,300 మంది పేదలకు అప్పట్లో రామేశం మెట్ట వద్ద ఇళ్ల స్థలాలిచ్చారు. ఆ స్థలాలను ఆక్రమిస్తూ కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారనే సమాచారం మేరకు.. లబ్ధిదారులతో కలిసి దొరబాబు శనివారం ఆ భూములను పరిశీలించారు. అక్కడికి సమీపంలోనే చెత్తతో విద్యుదుత్పత్తి చేసే జిందాల్ కంపెనీ నిర్మాణం జరుగుతూడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పేదలకిచ్చిన స్థలాల్లో ఏవిధంగా పరిశ్రమ నిర్మిస్తారని ఆ కంపెనీ అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ అనుమతి మేరకే పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని వారు చెప్పారు. ఈ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చారని, దానిలో టీడీపీ, జనసేన, వైఎస్సార్ సీపీకి చెందిన లబ్ధిదారులున్నారని దొరబాబు తెలిపారు. గతంలో డిప్యూటీ సీఎంగా, నేడు ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మకాయల చినరాజప్ప ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇప్పించకపోగా.. పేదలకు రిజిస్ట్రేషన్ చేసిన భూములను పరిశ్రమకు కేటాయించడం దారుణమని మండిపడ్డారు. పరిశ్రమకు కేటాయించిన భూములతో పాటు పేదల ఇళ్ల స్థలాల్లోని రాళ్లను సైతం తొలగించారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ చెత్త వేయడంతో ఏవిధంగా ఇళ్లు నిర్మించుకుని జీవించగలమని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా దొరబాబు విలేకర్లతో మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో 2,300 మంది లబ్ధిదారులకు ఒకటిన్నర సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి, పట్టాలు ఇచ్చామని చెప్పారు. ప్రతి లబ్ధిదారు స్థలం విలువ రూ.10 లక్షలుంటుందన్నారు. పరిశ్రమ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే పేదల స్థలాలే కావలసి వచ్చాయా అని ప్రశ్నించారు. కాలుష్య పరిశ్రమతో ఆ ప్రాంతంలో పేదలు ఇళ్లు నిర్మించుకుని, జీవించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పట్టాలు పొందిన ప్రతి ఒక్కరికీ మరోచోట అనువైన స్థలాలు ఇచ్చేంత వరకూ తాము ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం, దొరబాబు లబ్ధిదారులతో కలసి రామేశం మెట్ట నుంచి పెద్దాపురం ఆర్‌డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్‌డీఓ లేకపోవడంతో పరిపాలనాధికారి కేవీ మాధవరావుకు సమస్య వివరించి, వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు గోపు మురళి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఇనకొండ విష్ణుచక్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు వీరబాబు, జిల్లా సహాయ కార్యదర్శి నరాలశెట్టి త్రినాథ్, సీనియర్ నాయకులు గోలి రామారావు, ఆకుల వీరబాబు, పల్లా గంగారావు, పరిమి శ్రీనివాస్, బోనాసు గుర్రాజు, ఆనూరి స్వామి, కనపర్తి సీమదొర, పాగా సురేష్ కుమార్, ఇరుసుమళ్ల సాయి తదితరులు పాల్గొన్నారు.
పేదల స్థలాలే దొరికాయా?
జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన సెంటున్నర స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఇటీవల కుటుంబ సభ్యులతో కలసి వెళ్తే.. అక్కడ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమ నిర్మాణం జరుగుతోంది. మా స్థలాల్లోకి వెళ్లడానికి కూడా సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. ఈ దారుణాన్ని అడ్డుకోవాలి. పరిశ్రమ నిర్మాణానికి పేదల స్థలాలే దొరికాయా?
– దువ్వాడ మణి, బి.తాటిపర్తి,
పెద్దాపురం మండలం
ఇళ్ల స్థలాల్లో చెత్త వేశారు
పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల్లో చెత్త వేశారు. అక్కడ భరించలేని చెడు వాసన వస్తోంది. పరిశ్రమ సమీపంలో ఇళ్లు కట్టుకుని జీవించలేని పరిస్థితి. జగన్‌బాబు మాకు రిజిస్ట్రేషన్ చేసి మరీ స్థలాలు ఇచ్చారు. సొంతిల్లు లేని మాకు ఇంటి స్థలం వచ్చిందనే ఆనందం కూడా లేకుండా చేస్తున్నారు. న్యాయం చేయాలి.
– గుర్లింకల కుమారి,
సిరివాడ, పెద్దాపురం మండలం


