ఊ.. అంటారా.. ఊహూ అంటారా? | - | Sakshi
Sakshi News home page

ఊ.. అంటారా.. ఊహూ అంటారా?

May 31 2026 12:24 AM | Updated on May 31 2026 12:24 AM

చంద్రబాబును కలవనున్న

ఎయిర్‌పోర్టు బాధిత రైతులు

ఆయన స్పందనపై సర్వత్రా ఆసక్తి

తొండంగి: అన్నవరం పుణ్యక్షేత్రానికి కూతవేటు దూరంలో ప్రతిపాదించిన ఎయిర్‌పోర్టును ఇక్కడి నుంచి మరోచోటుకు తరలించాలని బాధిత గ్రామాలైన అన్నవరం, బెండపూడి, పీఈ చిన్నాయపాలెం రైతులు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం తుని మండలం హంసవరం రానున్న సీఎం చంద్రబాబును వారు కలవనున్నారు. మూడు గ్రామాల్లో రెండు పంటలు పండే దాదాపు 1,200 ఎకరాల భూములు సేకరించి, ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ మూడు గ్రామాల రైతులు సాగరమాల, రైల్వే లైన్‌, పుష్కర, పోలవరం కాలువలతో పాటు జాతీయ రహదారి బైపాస్‌కు భూములిచ్చి నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ ఎయిర్‌పోర్టు నిర్మాణం పేరిట తమ భూములు లాక్కొనే ప్రయత్నాలను నిరసిస్తూ బాధిత రైతులు ఉద్యమబాట పట్టారు. వాస్తవానికి ఇక్కడ ఎయిర్‌పోర్టు ప్రతిపాదన లేదంటూ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌తో పాటు ఈ ప్రాంత కూటమి నాయకులు గత ఏడాది ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ ఏడాది ఈ ప్రతిపాదన మళ్లీ తెర పైకి రావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ భూముల విలువ ప్రస్తుతం రూ.కోట్లలో ఉంది. ఈ నేపథ్యంలో రైతులందరూ తొండంగి మండలానికి చెందిన కూటమి పార్టీ నేతకు ఎకరాకు రూ.లక్ష చొప్పున ‘తాంబూలం’ చెల్లించుకుని మరీ రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా తమ భూములను కమర్షియల్‌ కన్వర్షన్లు చేసుకున్నారు. బెండపూడి, పీఈ చిన్నాయపాలెం ప్రాంతాల్లో భారీగా లే అవుట్లు కూడా ఏర్పాటయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ ఎయిర్‌పోర్టు ప్రతిపాదన రావడంతో వారు కలవరపడుతున్నారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ బాధిత రైతులు కలెక్టర్‌, స్థానిక తహసీల్దార్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇప్పటికే వినతిపత్రాలు సమర్పించారు. ఇటీవల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ జగ్గంపేట రానున్నారని తెలియడంతో ఆయనను కలిసేందుకు సన్నద్ధమయ్యారు. అయితే, ఆయన పర్యటన రద్దయ్యింది. కాగా, సోమవారం హంసవరం రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తమ గోడు వినిపించుకోవాలని బాధిత రైతులు నిర్ణయించారు. సీఎం రైతుల మొర ఆలకించి ఊ.. అంటారా.. లేక ఉఉ.. అంటారా అనేది వేచి చూడాల్సిందే.

అధికారుల్లో సందిగ్ధత!

ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత భూములకు పోలవరం, పుష్కర కాలువలతో పాటు దక్షిణాన రైల్వే లైను, తూర్పున సాగరమాల ప్రాజెక్టు రహదారి, ఉత్తరాన జాతీయ రహదారి సరిహద్దులుగా ఉన్నాయి. దీంతో పాటు అన్నవరం పుణ్యక్షేత్రం నో ఫ్లై జోన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రతికూల అంశాలే ఎక్కువగా ఉన్నాయనే ఆలోచనలో అధికార యంత్రాంగం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement