రాజవొమ్మంగి: చిట్టడవుల్లో సహజ సిద్ధంగా కనిపించే అనేక రకాల పండ్లలో చిలుకదుద్దు ప్రధానమైంది. ఇవి ఎరుపు రంగులో చెర్రీ పండ్ల మాదిరిగా ఉంటాయి. తీయగా.. కొంత వగరుగా ఉండే ఈ పండ్లు అంటే గిరిజన చిన్నారులకు ఎంతో ఇష్టం. అడవి పనులకు వెళ్లేవారు తమ పిల్లల కోసం వీటిని సేకరించి ఇంటికి తీసుకొస్తారు. సాధారణంగా రక్షిత అటవీ ప్రాంతంలో వేసవి మొదలు తొలకరి ప్రవేశించే వరకూ లభించే రకరకాల పండ్లలో చిలకదుద్దు ఒకటి. ప్రకృతి సిద్ధంగా అడవిలో లభించే రకరకాల పండ్ల జాతి చెట్లు రానురాను అంతరించిపోతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. పిల్లలకే కాదు, ఎన్నో అరుదైన పక్షుల ఆహార కొరతను తీర్చే ఈ పండ్ల చెట్లను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.


