– పాటంశెట్టి సూర్యచంద్ర ఆవేదన
కిర్లంపూడి: జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న మట్టి, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాపై ప్రశ్నిస్తే ఇంటికొచ్చి భౌతిక దాడులు చేయడం సమంజసమేనా అంటూ గత ఎన్నికల్లో జగ్గంపేట నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పాటంశెట్టి సూర్యచంద్ర స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ప్రశ్నించారు. సోమవారం బూరుగుపూడిలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీ, ప్రజా సమస్యలపై తన నివాసంలో ప్రెస్‌మీట్ పెడితే జరగకుండా ఆపేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మా ఇంటి పైకి పంపించి నా మీద, నా శ్రేయోభిలాషుల మీద భౌతిక దాడులు చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుని అణచివేయడం న్యాయమా? అని సూర్యచంద్ర ప్రశ్నించారు. తన ఇంటి మీదకి వచ్చి తన మీద, తన అనుచరులపై దౌర్జన్యం చేయడమే కాకుండా, తమపై తప్పుడు కేసులు బనాయించడానికి ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోయడమేనని అన్నారు. ఎమ్మెల్యే అవినీతి చేయకపోతే నియోజకవర్గంలో కోట్లాది రూపాయల మట్టి, ఇసుక అక్రమ తోలకాలు ఎవరు చేస్తున్నారో నిరూపించాలన్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని హరించే హక్కు మీకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేసి, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇరువర్గాలు పరస్పరం కేసులు
బూరుగుపూడిలో జరిగిన వివాదంపై ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నట్టు స్థానిక ఎస్సై జి.సతీష్ తెలిపారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పాటంశెట్టి సూర్యచంద్ర ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో సూర్యచంద్ర దూషించారంటూ టీడీపీ దళిత నేత మూరా సత్తిబాబు ఫిర్యాదు చేశారు.


