రాజమహేంద్రవరం రూరల్: కాతేరులోని తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం జరిగిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన లభించిందని ఆ విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సుమారు 13 వేల మంది హాజరయ్యారని తెలిపారు. తిరుమలరావు మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్ ప్రవేశ పరీక్షలకు జరిగే విద్యా బోధన, సాధనను వివరించారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీ, త్రిబుల్ ఐటీ, బిట్స్‌పిలాని వంటి సంస్థల్లో సీటు సాధించేందుకు విద్యార్థులు చేయాల్సిన కృషిని వివరించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో దేశ వ్యాప్తంగా జరిగే ఇంజినీరింగ్ (జేఈఈ మెయిన్ అండ్ అడ్వాన్స్) పరీక్షలలో 30 మంది పరీక్ష రాస్తే, కేవలం ఒక్కరికి మాత్రమే సీటు దొరుకుతుందన్నారు. అదే తిరుమలలో ప్రతి నలుగురిలో ఒకరికి సీటు లభిస్తుందన్నారు. మెడికల్‌లో దేశ వ్యాప్తంగా జరిగే నీట్ పరీక్షల ప్రకారం 25 మంది పరీక్ష రాస్తే, కేవలం ఒకరికి సీటు లభిస్తుందని, అదే తిరుమలలో ప్రతి ముగ్గురిలో ఒకరికి మెడికల్ సీటు వస్తుందన్నారు. తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ నున్న సరోజినిదేవి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి విద్యార్థుల్లో సేవాగుణం, పెద్దల పట్ల గౌరవం అలవాటు చెయ్యాలన్నారు. 2025లో ఐఐటీ మద్రాస్‌లో సీటు సాధించిన యార్లగడ్డ తనూజ, నీట్‌లో స్టేట్ ఫస్ట్, ఆలిండియా 19వ ర్యాంకర్, ఎయిమ్స్ న్యూఢిల్లీలో సీటు సాధించిన డి.రామ్‌కిరీటి తండ్రి డి.అరుణ్‌కుమార్ పాల్గొని తిరుమల విద్యా సంస్థలో వారికున్న అనుభవాలను సదస్సుకు వివరించారు. అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు, తిరుమల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.


