నేడు నూతన కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

నేడు నూతన కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

Apr 1 2026 7:48 AM | Updated on Apr 1 2026 7:48 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లా నూతన కలెక్టర్‌గా ఎంఎన్‌ హరేందిర ప్రసాద్‌ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన బుధవారం ఉదయం 9 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు.

గవర్నర్‌ పర్యటనకు

పక్కా ఏర్పాట్లు చేయాలి ˘

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఏప్రిల్‌ 2న కాకినాడలో పర్యటించనున్నందున సంబంధిత ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జేఎన్‌టీయూకే 12వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గవర్నర్‌ వస్తున్నారన్నారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో హెలిపాడ్‌ను సిద్ధం చేసి, రూట్‌ బారికేడింగ్‌ చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. కాన్వాయ్‌, రూట్‌ క్లియరెన్స్‌, గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ వంటివి పోలీస్‌ శాఖ చేపట్టాలన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సీసీ కెమెరాలతో

నేరాల అదుపు : ఎస్పీ

కాకినాడ రూరల్‌: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణే లక్ష్యంగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ జి.బిందుమాధవ్‌ అన్నారు. సర్పవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన సమగ్ర నిఘా ప్రాజెక్టును మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఓఎన్‌జీసీ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద అందించిన నిధులతో 19 కీలక ప్రాంతాల్లో 64 సీసీ కెమెరాలను, జెమినీ ఎడిబుల్స్‌ – ఫ్యాట్స్‌ ఇండియా సంస్థ సహకారంతో 9 ప్రధాన కూడళ్లలో 18 ఏఎన్‌పీఆర్‌ (ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌) కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అత్యాధునిక కెమెరా వ్యవస్థ ద్వారా సర్పవరం పరిధిలోని రద్దీ ప్రాంతాలు, సున్నిత ప్రదేశాల్లో 24 గంటలూ నిఘాకు అవకాశం కలిగిందని అన్నారు. ముఖ్యంగా ఏఎన్‌పీఆర్‌ కెమెరాల ద్వారా చోరీ అయిన వాహనాలను పట్టుకోవడం సులభమవుతుందన్నారు. నేరాలకు పాల్పడి, పరారయ్యే వారిని త్వరితగతిన గుర్తించవచ్చని తెలిపారు. ఈ 82 కెమెరాలు సర్పవరం పోలీస్‌ స్టేషన్‌లోని కేంద్ర నియంత్రణ గదికి అనుసంధానమై ఉంటాయని, ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది వీటిని పర్యవేక్షిస్తారని చెప్పారు. మహిళల రక్షణ, రాత్రి నిఘా, రహదారి భద్రతను మెరుగుపరచడంలో ఈ ప్రాజెక్ట్‌ కీలకమన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ, ఇన్‌చార్జి డీఎస్పీ పాటిల్‌ దేవరాజ్‌ మనీష్‌, ఓఎన్‌జీసీ ఈడీ, అసెట్‌ మేనేజర్‌ ప్రబల్‌సేన్‌ గుప్తా, జెమినీ ఎడిబుల్‌ ఆయిల్స్‌ జీఎం గురుప్రసాద్‌, సీఎస్‌ఓ వీరయ్య, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ, సర్పవరం, రూరల్‌ సీఐలు పెద్దిరాజు, చైతన్యకృష్ణ, ఎస్సై శ్రీనివాస్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా దేవదాయ శాఖాధికారిగా

సూర్యనారాయణ

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లా దేవదాయ, ధర్మాదాయ శాఖాధికారిగా తలాటం వెంకట సూర్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటి వరకూ జిల్లా దేవదాయ శాఖాధికారిగా పని చేస్తున్న కనపర్తి నాగేశ్వరరావు ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో నియమితులైన సూర్యనారాయణ ప్రస్తుతం కరకుదురు గ్రూపు టెంపుల్‌ ఈఓగా విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement