● ప్రైవేటు పాఠశాలల సిబ్బంది
గ్రామాల బాట
● అడ్మిషన్ల కోసం ఇంటింటా జల్లెడ
● తల్లిదండ్రులు జాగరూకతతో ఉండాలి
● విద్యావేత్తల సూచన
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి దాదాపు మరో మూడు నెలల సమయం ఉంది. ప్రస్తుతం పాఠశాలల్లో ఒంటి పూట తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్ల కోసం ఇప్పటి నుంచే వల వేస్తున్నాయి. మధ్యాహ్నం వేళ తమ సిబ్బందిని గ్రామాలకు పంపిస్తూ పిల్లల కోసం జల్లెడ పడుతున్నాయి. దీంతో, వారు బృందాలుగా ఇంటింటికీ తిరుగుతున్నారు. ‘మీ ఇంట్లో ఎంత మంది పిల్లలున్నారు.. ఏం చదువుతున్నారు.. మా స్కూల్లోనే చేర్పించండి’ అంటూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాస్త పేరొందిన ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలైతే సొంత వాహనాల్లోనే గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు మంచి విద్యాలయాల కోసం చూస్తున్నారనే సమాచారం ఉంటే చాలు.. వారికి దాదాపు గంట పాటు కౌన్సెలింగ్ ఇచ్చి, ఏదో ఒక విధంగా అడ్మిషన్లు ఓకే చేసుకుంటున్నారు. ఇదే సమయంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న చాలా విద్యా సంస్థలు ప్రభుత్వ గుర్తింపు, రిజిస్ట్రేషన్ లేకుండానే అడ్మిషన్ల పర్వానికి తెర తీస్తున్నాయి. ఆకర్షణీయమైన బ్రోచర్లు, ప్రకటనలు, ప్రచారాలతో తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అడ్మిషన్లు తీసుకోవడానికి ముందే తల్లిదండ్రులు జాగరూకతతో వ్యవహరించాలని, ఆయా విద్యా సంస్థలకు అన్ని అనుమతులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో సరి చూసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
పాఠశాలలకు అనుమతి ఇలా..
నిబంధనల ప్రకారం కొత్తగా ప్రైవేటు పాఠశాల ప్రారంభించాలంటే విద్యా శాఖ అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాతే పాఠశాలను తెరచి విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తి స్థాయి అనుమతి పొందాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యా శాఖ రీజినల్ డైరెక్టర్ (ఆర్‌జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషనర్ నుంచి అనుమతి తీసుకోవాలి. సీబీఎస్‌ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి సమ్మతించాలి.
అను‘మతి’ లేకుండానే..
కొన్ని విద్యా సంస్థలు ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే నడుస్తున్నాయి. పిఠాపురం డివిజన్‌లో ఇటీవలే కొత్తగా మూడు పాఠశాలలు వెలిశాయి. వాటి బోర్డులపై రిజిస్ట్రేషన్ పొందిన సంస్థ అని రాస్తున్నారు కానీ, వాటిలో కొన్ని ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపూ లేకుండానే నడుస్తున్నాయి. కొన్ని పాఠశాలలు సీబీఎస్‌ఈ అనుమతులున్నట్లు కూడా ప్రచారం చేస్తున్నాయి. అలాంటి పాఠశాలలు ఏడాది చివరిలో ఇతర విద్యా సంస్థల పేరిట విద్యార్థులతో పరీక్షలు రాయించి మమ అనిపించేస్తున్నాయి. ఆ విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే తప్ప రెగ్యులర్ విద్యార్థిగా పరిగణించదు. మరికొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు బ్రాంచీల పేరిట వేరే చోట పాఠశాలలు, కళాశాలలను నిర్వహిస్తూ ఎక్కడో ఉన్న మెయిన్ బ్రాంచి ద్వారా పరీక్షలు రాయిస్తున్నాయి. అధికారుల చర్యలు అంతంత మాత్రంగానే ఉండటంతో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న ప్రైవేటు విద్యా సంస్థలు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
పిల్లలకు అడ్మిషన్లు తీసుకునే తల్లిదండ్రులు తప్పనిసరిగా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.
సంబంధిత ప్రైవేటు పాఠశాల అనుమతి ప త్రాలను ముందుగానే నిశితంగా పరిశీలించుకోవాలి. ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉందో లే దో తెలుసుకున్న తరువాతే అడ్మిషన్ తీసుకోవాలి.
సదరు పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, క్రీడా ప్రాంగణం, గాలి, వెలుతురు సక్రమంగా వచ్చే భవనాలు తదితర మౌలిక సౌకర్యాలను స్వయంగా పరిశీలించడం మంచిది.
పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చే వాహనాల కండిషన్, వాటిని పాఠశాలే సమకూర్చుతోందా, బయటి నుంచి ఏర్పాటు చేసుకోవాలా అనే విషయాలపై ఆరా తీయాలి.
ఒక్కో తరగతి గదిలో ఎంతమంది విద్యార్థుల ను కూర్చోబెడతారు? విద్యార్థుల సంఖ్యకు అ నుగుణంగా అన్ని సబ్జెక్టులకూ ఉపాధ్యాయులున్నారా, లేరా అనే విషయం తెలుసుకోవాలి.
జీ+1 భవనమైతే అగ్నిమాపక నిబంధనలు పాటిస్తున్నారా, అవసరమైన పరికరాలు, సామగ్రి సిద్ధంగా ఉంచారా తదితర అంశాలను పరిశీలించాలి.
ప్రభుత్వ గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసుకుని, తగు నిర్ణయం తీసుకోవాలి.
ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం..
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచే విద్యార్థులను చేర్పించాలంటూ జిల్లా విద్యాశాఖాధికారి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే అన్ని ఫ్రీ అంటూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అడ్మిషన్లు చేర్పించాలంటూ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు కూడా సూచించడంతో కళాశాలల అధ్యాపకులు కూడా గ్రామాల బాట పడుతున్నారు.


