● రానున్న రోజుల్లో ప్రజలే చెక్ పెడతారు
● రాజధాని, పోలవరం
చంద్రబాబుకు ఏటీఎంలు
● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
కపిలేశ్వరపురం (మండపేట): రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని, ఆయన చర్యలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండపేటలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. అమరావతికి చట్టబద్ధత తెస్తూ తీర్మానం చేసినట్టు కూటమి నేతలు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. తర్వాత ఎవరొచ్చినా రాజధానిని మార్చలేని విధంగా చట్టం చేసినట్టు గొప్పలు చెబుతున్నారని, అలాంటప్పుడు ఇప్పటి వరకూ అమరావతి రాజధాని కాదని అంటారా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హంగామా చేస్తున్న చంద్రబాబు ఆ చట్టమేదో నవ్యాంధ్రకు తొలిసారి సీఎం అయ్యినప్పుడు ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో చేస్తున్న జపమంతా చంద్రబాబు, కూటమి నేతలు రూ.లక్షల కోట్లు దోచుకోవడానికి చేస్తున్న జిమ్మిక్కులని ఆయన ఆరోపించారు. రాజధానిని అభివృద్ధి చేశామని చెబుతున్న చంద్రబాబు మాటలు మసిపూసి మారేడుకాయ చేసినట్టున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేశానని చెబుతున్న తీర్మానాలు కేవలం విపక్షాన్ని విమర్శించడానికి తప్ప అందులో రాష్ట్ర ప్రయోజనాలేవీ లేవన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను చంద్రబాబు ఏటీఎంలుగా మార్చుకున్నారని గతంలో ప్రధాని మోదీ చెప్పారని గుర్తు చేశారు. అమరావతిలో రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న పేరుతో తన అనుచరులకు టెండర్లు ఇచ్చుకుంటున్నారని అన్నారు. 50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛను ఇస్తామని, ప్రతి మహిళకు నెలకు రూ.15 వందలు ఇస్తామని, చేనేత కార్మికులకు ఏడాదికి రూ.25 వేలు ఇస్తామంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వీటన్నింటిపై నిలదీస్తారనే భయంతోనే విపక్ష నేతలను విమర్శిస్తూ కూటమి నేతలు కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. ఎన్టీఆర్‌ను సీఎం కుర్చీ నుంచి దించేసి క్షోభ పెట్టారని, అలాంటి చంద్రబాబు సామాన్య ప్రజలకు మేలు చేస్తారన్నది అభూత కల్పన అని తోట త్రిమూర్తులు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లా వీరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరగ్రుంట అయ్యప్ప, మాజీ కౌన్సిలర్లు మందపల్లి రవికుమార్, మెండు బాపిరాజు, పోతంశెట్టి ప్రసాద్, ముమ్మిడివరపు బాపిరాజు, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు పలివెల మధు పాల్గొన్నారు.


