● ఏడాదిలో ఎనిమిది మంది పీడీల బదిలీ
● అభివృద్ధిపై కానరాని శ్రద్ధ
● ప్రజా ఫిర్యాదుల వేదిక
నిర్వహణకే పరిమితం
పిఠాపురం: పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక హబ్‌గా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. దానిని అమలులో పెట్టడానికి ఒక అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఘనంగా ప్రకటించారు. ఈ మేరకు పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని (పాడా) ఏర్పాటు చేస్తూ జీఓ విడుదల చేయించారు. అనంతరం, ఒక ఐఏఎస్ అధికారితో పాటు 17 మంది సిబ్బంది నియమిస్తూ మరో జీఓ ఇచ్చారు. పాడా కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా పీడీల నియామకంలో బదిలీల పర్వం చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. కేవలం ఒక్క ఏడాదిలోనే ఎనిమిది మంది పీడీలను బదిలీ చేయడంతో అసలేం జరుగుతోందో అర్థం కాక పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.
ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి
పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ నెగ్గినప్పటి నుంచీ 20 నెలల వ్యవధిలో సొంత నియోజకవర్గ ప్రజలకు 20 రోజులు కూడా అందుబాటులో లేరనే విమర్శలున్నాయి. ఇప్పటికే ఇన్‌చార్జిలతో పాలన సాగిస్తున్న ఆయన.. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఆపే ప్రయత్నంలో భాగంగానే పాడా ఏర్పాటు చేశారనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకూ ఇన్‌చార్జి నాయకుడితో అన్నీ చక్కబెడుతున్న పవన్.. రానున్న రోజుల్లో అధికారులతో పరిపాలన చేయించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాము నెగ్గించుకున్న నాయకుడు ఎక్కడో ఉండి.. ఇక్కడ ఎవరితోనో పాలన చేయిస్తుంటే తాము ఆయనను ఎందుకు గెలిపించామో అర్థం కావడం లేదంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి నెలల తరబడి రాకపోవడంతో ఇప్పటికే స్థానికుల్లో పవన్ కల్యాణ్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దానిని తప్పించుకోవడానికి పాడా ఏర్పాటు చేసినప్పటికీ ప్రయోజనం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
బది‘లీలలు’
పాడా ఏర్పాటు చేసిన మొదట్లో ప్రత్యేక కలెక్టర్ శ్రీధర్‌ను ఇన్‌చార్జి పీడీగా నియమించి కార్యకలాపాలు ప్రారంభించారు. మిగిలిన అధికారులు, సిబ్బందిని ఇతర శాఖల నుంచి తీసుకువచ్చి ఇక్కడ నియమించారు. కొంత కాలానికే డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న చైత్రవర్షిణిని పాడా పీడీగా పూర్తి బాధ్యతలతో నియమించారు. కొంత కాలానికే ఆమెను బదిలీ చేసి వరుసగా ఇన్‌చార్జి పీడీలతో నెట్టుకొస్తున్నారు. ఇటీవల కొత్తగా భవానీ శంకర్‌ను రెగ్యులర్ పీడీగా ప్రభుత్వం నియమించింది. కానీ, కనీసం వారం రోజులు కూడా ఇక్కడ పని చేయకుండానే ఆయనను బదిలీ చేశారు. అనంతరం శివరాం ప్రసాద్‌ను పీడీగా నియమించారు.
గ్రీవెన్స్‌కే పరిమితం
పాడా పీడీలుగా నియమితులవుతున్న అధికారులు పట్టుమని పది నెలలు కూడా పని చేయకుండా బదిలీ అవుతున్నారు. కేవలం పాడా కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించి, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం తప్ప ఏమీ చేయలేకపోయారనే విమర్శలున్నాయి. కేవలం ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహించడం, అర్జీలు స్వీకరించడం తప్ప వాటి పరిష్కారంపై దృష్టి సారించిన దాఖలాల్లేవు. దీంతో పాడా కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు జనం రావడం మానేశారనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకూ పాడా పీడీలుగా
పని చేసిన అధికారులు
శ్రీధర్, చైత్రవర్షిణి, వేణుగోపాల్, సత్యనారాయణ, మల్లిబాబు, శ్రీనివాసరావు, భవానీ శంకర్, శివరాం ప్రసాద్ (ప్రస్తుతం)


