● జిల్లాలో 104 సేవలు అస్తవ్యస్తం
● ద్విపాత్రధారులుగా ఉద్యోగులు
● మందుల కొరత, ఫేక్ ఓపీ ఎంట్రీలు
● అంతంత మాత్రంగా వైద్య పరీక్షలు
కాకినాడ క్రైం: డ్రైవర్లే ల్యాబ్ టెక్నీషియన్లు.. డేటా ఎంట్రీ ఆపరేటర్లే (డీఈఓ) ఫార్మసిస్టులు, ఎంఎల్‌హెచ్‌పీలే డాక్టర్లు.. కదిలే చికిత్సాలయంగా పేరు పొందిన గ్రామీణ సంచార వైద్యశాల 104లో ఇటువంటి ద్విపాత్రభినయాలు నిత్యకృత్యమయ్యాయి.
తగినన్ని నియామకాల్లేవు.. అరకొర మందులు.. కొరగాని వైద్య సదుపాయాలు.. ఉత్తుత్తి డేటాలు, నకిలీ ఎంట్రీలు, ల్యాబ్ టెస్ట్‌లకు తిలోదకాలు.. కాంట్రాక్ట్ సంస్థ వేధింపులు.. ఉద్యోగులకు ప్రత్యక్ష నరకం వెరసి జిల్లాలో 104 సేవల పరిస్థితి కడు దయనీయంగా ఉంది.
104 ఎందుకంటే..
గ్రామాలకు వెళ్లి బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వంటి ప్రాథమిక స్థాయి వైద్య పరీక్షలు చేయడం, ఉచితంగా మందులు ఇవ్వడం, గర్భిణులు, చిన్న పిల్లల ఆరోగ్య పరిశీలన, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహణ, అవసరాన్ని అనుసరించి రోగులను సమీప ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేయడం, దగ్గర్లో ఆసుపత్రి సదుపాయం లేని ప్రజలకు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్య సంరక్షణ, పర్యవేక్షణకు 104 వాహన సేవలు దోహదం చేస్తాయి.
21 వాహనాలు
జిల్లాలో 104 వాహనాలు బఫర్‌తో కలిపి మొత్తం 21 ఉన్నాయి. ఇవి జిల్లాలోని 410 విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లకు నెలకు రెండుసార్లు చొప్పున వెళ్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సేవలందిస్తారు. సచివాలయం లేదా కమ్యూనిటీ హాళ్లలో ఈ శిబిరాలు నిర్వహిస్తారు. వైద్య సేవల్లో డ్రైవర్, డీఈఓ, ఏఎన్‌ఎం, ఆశా, ఎంఎల్‌హెచ్‌పీ, మెడికల్ ఆఫీసర్, అంగన్‌వాడీ టీచర్ పాలు పంచుకుంటారు. స్థానిక పీహెచ్‌సీ నుంచి మెడికల్ ఆఫీసర్ అక్కడకు చేరుకుంటారు.
ఉద్యోగుల గగ్గోలు
జిల్లాలోని 21 వాహనాల్లో నిబంధనల ప్రకారం 42 మంది సిబ్బంది ఉండాలి. కానీ, సుమారు 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే, ల్యాబ్ టెక్నీషియన్లను (ఎల్‌టీ) నియమిస్తామని, 20కి పైగా టెస్ట్‌లు చేస్తామని చెప్పి, ఒక్కో వాహనానికి నెలకు గతం కంటే సుమారు రూ.లక్ష చొప్పున అధికంగా కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వం నుంచి వసూలు చేస్తోందని సిబ్బంది చెబుతున్నారు. కాంట్రాక్టు పొంది పది నెలలు గడచినా ఇప్పటికీ ఒక్క ఎల్‌టీని కూడా నియమించలేదని అంటున్నారు. పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించకపోవడంతో ఉన్నవారు సెలవు పెడితే సేవలు నిలిచిపోవడం సర్వసాధారణమవుతోంది. ప్రత్యేక పరిస్థితుల్లో తాత్కాలికంగా ఎవరో ఒకరిని తీసుకొస్తున్నారు. ఆ రోజుకు వారికిచ్చే మొత్తాన్ని కూడా సెలవు పెట్టిన సిబ్బంది జీతం నుంచే కోత పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. క్యాజువల్ లీవ్స్ వినియోగించుకునే వెసులుబాటు ఇవ్వడం లేదు. సెలవు వాడుకుంటామంటే జీతంలో కోత పెడుతున్నారని సిబ్బంది వాపోతున్నారు. సమస్యలపై ఎవరైనా ప్రశ్నిస్తే ఏకంగా ఉద్యోగాలు తీసేస్తున్నారని, ఈవిధంగా మూడు నెలల్లో నలుగురిని తొలగించారని చెబుతున్నారు. కాంట్రాక్ట్ సంస్థ అధిపతి మంత్రి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడని అంటున్నారు. అందువలన లోకేష్ జోక్యం చేసుకొని తమ సమస్యలు పరిష్కరించి, 104 సేవలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు.
మెడికల్ ఆఫీసర్ల ఎగనామం
104 వాహనాలు వెళుతున్న ప్రతి చోటుకూ స్థానిక మెడికల్ ఆఫీసర్ (ఎంఓ) వెళ్లాలి. కానీ, చాలా మంది ఎంఓలు రాకుండానే వచ్చినట్లు ఫేక్ హాజరు చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రోగులకు ఎంఎల్‌హెచ్‌పీలు తమకొచ్చిన వైద్యం చేసి పంపిస్తున్నారు. హెవీ వెహికల్ లైసెన్సు లేని డ్రైవర్లకు వాహనాలను ఇస్తూ 104 సేవలను ప్రమాదంలోకి నెడుతున్నారు. చాలా వాహనాల్లో ఏసీలు పని చేయడం లేదు. దీంతో, ఈసీజీ సహా కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం క్లిష్టతరంగా మారింది. ఉక్కపోతతో ఉడికిపోతూ ఎంత త్వరగా పరీక్ష పూర్తవుతుందా, వాహనం నుంచి బయటపడతామా అనే పరిస్థితి నెలకొంది. నిండు గర్భిణుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కొన్ని వాహనాల్లో పరికరాలు లేక వైద్య పరీక్షలకు ఆటంకం ఏర్పడుతుంటే, కొన్ని వాహనాల్లో అవి ఉన్నా వాడటం లేదు. రెండేళ్లుగా చాలా వాహనాల్లో ఆర్థోస్కోప్‌ల సీలు కూడా విప్పలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరకు రోగిని పరీక్షించేందుకు వినియోగించే టార్చ్‌లైట్లలో కనీసం బ్యాటరీలు కూడా లేని దుస్థితి నెలకొంది.
ఫేక్ ఎంట్రీలు!
చాలాచోట్ల 104 వాహనాల్లో ఓపీకి రోగులు రాకుండానే వచ్చినట్టు ఫేక్ ఎంట్రీలు చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవడానికే ఈ అడ్డదారి తొక్కుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అలాగే, తప్పనిసరిగా చేయాల్సిన క్లోరినేషన్ టెస్ట్‌ల ఊసే లేదు. స్థానిక సచివాలయ ఇంజనీర్ ఆయా గ్రామాల్లోని వాటర్ ట్యాంకుల్లో నీటిని పరీక్షించి పీహెచ్ విలువలివ్వాలి. వీటిని సంబంధిత పోర్టల్‌లో 104 డీఈఓ అప్‌లోడ్ చేయాలి. కానీ, ఈ పరీక్షలు జరగకపోవడంతో చేతికొచ్చిన తప్పుడు విలువలు నమోదు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తప్పుడు లెక్కల ఆధారంగానే ప్రభుత్వం తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తూండటం ఆందోళన కలిగిస్తోంది.


