● జిల్లావాసులకు గ్యాస్ కష్టాలు
● బ్లాక్‌లో డొమెస్టిక్ సిలిండర్ల విక్రయాలు
● సామాన్యులకు సకాలంలో
అందని దుస్థితి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పశ్చిమాసియాలో మూడు వారాల క్రితం మొదలైన యుద్ధం మన వంటింట్లో మంటలు పుట్టిస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా గత నెల 28 ప్రారంభించిన ఈ యుద్ధం కారణంగా సామాన్య ప్రజలతో పాటు, హోటళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా కొంత మంది గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు.. అక్రమాలకు తెర లేపుతూ గ్యాస్ కొరతను క్యాష్ చేసుకుంటున్నారు. గృహ వినియోగదారులకు ఇవ్వాల్సిన డొమెస్టిక్ సిలిండర్లను దొడ్డిదారిన అధిక ధరకు కొంత మంది హోటల్ నిర్వాహకులకు విక్రయిస్తున్నారు. దీంతో, సామాన్యులు సకాలంలో వంట గ్యాస్ దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొరతతో ఇక్కట్లు
జిల్లావ్యాప్తంగా 45 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 6.5 లక్షలకు పైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా గుమ్మళ్లదొడ్డి, కాకినాడ పోర్టు నుంచి ప్రతి రోజూ ఆయా కంపెనీల గ్యాస్ సిలిండర్లు జిల్లాకు సరఫరా అవుతూంటాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ప్రతి రోజూ 12 వేలకు పైగా సిలిండర్ల వినియోగం ఉంటుంది. ఆ మేరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వంట గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కూడా స్పష్టం చేస్తున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా మండల కేంద్రాల్లో గ్యాస్ సక్రమంగా లభించడం లేదని గృహ వినియోగదారులు వాపోతున్నారు. యుద్ధానికి ముందు బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల్లో గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చేది. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. బుక్ చేసుకుని రోజులు గడుస్తున్నా సిలిండర్ ఇవ్వకపోవడంతో ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్దకు క్యూ కడుతున్నారు. పట్టణ ప్రాంతాలే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో సైతం వినియోగదారులు చాలా ఏళ్లుగా వంటకు పూర్తిగా గ్యాస్ సిలిండర్ల పైనే ఆధారపడ్డారు. వారికి గృహ వినియోగదారులకు దాదాపు నెలకో సిలిండర్ అవసరమవుతుంది. కానీ, ప్రస్తుతం పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత మాత్రమే డొమెస్టిక్ గ్యాస్ బుక్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో, గ్యాస్ అయిపోయిన వెంటనే సిలిండర్ దొరకక వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
దొడ్డిదారిన హోటళ్లకు..
జిల్లా కేంద్రమైన కాకినాడలో ఫైవ్ స్టార్ హోటల్‌తో పాటు 20కి పైగా భారీ రెస్టారెంట్లు, సుమారు వెయ్యి హోటళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా చిన్నచిన్న హోటళ్లు మరో 2 వేలకు పైగా ఉన్నాయి. దీనికి తోడు ఇంటి వద్ద ఇడ్లీ, దోశలు వేసుకునే అమ్మేవారు మరో 700 మందికి పైగా ఉన్నారు. సుమారు 1,800 నుంచి 2,500 వరకూ టీ స్టాల్స్ ఉన్నాయి. రోడ్డు పక్కన తోపుడుబండ్ల మీద న్యూడిల్స్ పాయింట్లు, పకోడీ బండ్లు 300 పైనే ఉన్నాయి. ఒక్క స్టార్ హోటల్‌లోనే రోజుకు 10కి పైగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తారు. రెస్టారెంట్లలో నిత్యం 6 నుంచి 8 సిలిండర్లు అవసరం. యుద్ధం మొదలైన తరువాత గ్యాస్ కొరత తలెత్తడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. ఇదే అదునుగా కొన్ని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాకినాడతో పాటు జిల్లాలోని సామర్లకోట, పిఠాపురం, తుని, గొల్లప్రోలు, జగ్గంపేట తదితర మండలాల్లోని కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సరఫరా నిలిపివేయడంతో హోటల్ నిర్వాహకులు అడ్డదారిలో డొమెస్టిక్ గ్యాస్ కొనుగోలు చేస్తున్నారు. వారికి కొన్ని గ్యాస్ ఏజెన్సీలు డొమెస్టిక్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీకి తెర లేపుతున్నారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.958 కాగా, వీటిని కొన్ని ఏజెన్సీల నిర్వాహకులు హోటళ్ల యజమానులకు రూ.2,500 వరకూ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
విద్యార్థులు, నిరుద్యోగులకు అవస్థలు
గ్యాస్ కొరత ప్రభావం విద్యార్థులు, నిరుద్యోగులపై కూడా పడుతోంది. దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు కాకినాడ వచ్చి, వివిధ కోచింగ్ సెంటర్లలో ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల నుంచి వస్తున్న వీరు స్థానికంగా ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థులు కూడా కాకినాడలోని వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. వంటలు చేసుకునే సమయం ఉండకపోవడంతో వీరందరూ స్థానికంగా ఉన్న చిన్న హోటళ్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం బిర్యానీ, న్యూడిల్స్ వంటివి తింటూంటారు. పలు కోచింగ్ సెంటర్లు, విద్యా సంస్థల సమీపాన ఉన్న చిన్నచిన్న క్యాంటీన్లు, హాస్టళ్లలో నెలవారీగా టోకెన్లు తీసుకుని భోజనాలు చేస్తూంటారు. గ్యాస్ కొరత కారణంగా వీటిని మూసివేయడంతో వీరందరూ అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో టిఫిన్లు, భోజనాలు దొరుకుతున్నా రేట్లు అమాంతం పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.20కి ఇచ్చే టిఫిన్ ధర ప్రస్తుతం రూ.30కి పెంచారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు సైతం సాధారణ రోజులతో పోల్చితే రూ.20 అధికంగా వసూలు చేస్తున్నారు.
ప్రజలపై భారం పడకుండా చూడాలి
యుద్ధం నేపథ్యంలో సాధారణ, మధ్య తరగతి ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే డొమెస్టిక్ సిలిండర్ ధరను ప్రభుత్వం రూ.60 పెంచేసింది. ఇదే ఇబ్బందిగా ఉంటే గ్యాస్ దొరకక ప్రజలు మరిన్ని కష్టాలు పడుతున్నారు. కమర్షియల్ సిలిండర్లు దొరకకపోవడంతో హోటళ్లు మూత పడుతున్నాయి. ఇదే అదనుగా హోటళ్లలో తినుబండారాల రేట్లు పెంచేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. పరిస్థితిని చక్కదిద్దాలి.
– దూసర్లపూడి రమణరాజు, కన్వీనర్,
కాకినాడ పౌర సంక్షేమ సంఘం
చిన్న హోటళ్లపై ప్రభావం
మరోవైపు పలు ప్రాంతాల్లో చిన్న హోటళ్లు, రోడ్డు పక్కన ఆహార వ్యాపారం చేసే వారిపై తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక చిన్న రెస్టారెంట్లు, హోటళ్లతో పాటు బండ్లపై చేస్తున్న న్యూడిల్స్, పానీపూరి, ఇడ్లీ, పకోడీ వంటి వ్యాపారాలు మూత పడ్డాయి. కాకినాడ విద్యుత్ నగర్, అశోక్ నగర్ గాంధీనగర్, రామారావుపేట, ఆర్టీసీ కాంప్లెక్స్, జగన్నాథపురం వంటి ప్రాంతాల్లో చిన్న హోటళ్లను వారం రోజులుగా తెరవడం లేదు. కొన్ని హోటళ్లలో కట్టెల పొయ్యి, ఊక పొయ్యిలతో పప్పు, సాంబారు, చారుతోనే భోజనాలు వడ్డిస్తున్నారు. పూర్తిగా గ్యాస్ సిలిండర్ పైనే ఆధారపడి టీ విక్రయించే దుకాణాలను కూడా పది రోజులుగా తెరచుకోవడం లేదు. కొన్ని టీ దుకాణాలు తెరచినా.. అధిక రేట్లకు టీ విక్రయిస్తున్నారు. మామూలు రోజుల్లో టీ రూ.10 కాగా ప్రస్తుతం రూ.15 వసూలు చేస్తున్నారు.


