ఇక మున్సిపల్టీలే.. | - | Sakshi
Sakshi News home page

ఇక మున్సిపల్టీలే..

Mar 18 2026 11:17 AM | Updated on Mar 18 2026 11:17 AM

నాడు ఫ్యాన్‌ హవా

రాష్ట్రవ్యాప్తంగా 2021లో నాటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జిల్లాలోని పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, తుని మున్సిపాలిటీలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల్లో ఫ్యాన్‌ హవా వీచింది. వైఎస్సార్‌ సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. అన్నిచోట్లా వైఎస్సార్‌ సీపీ పాలకవర్గాలు కొలువు తీరాయి. ఆయా పట్టణాల ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగించాయి. అభివృద్ధి చేసి చూపించాయి.

ముగిసిన పాలక వర్గాల పదవీ కాలం

ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం

పిఠాపురం: ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తమ ఓటుతో ఎన్నుకున్న పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి వెనుకాడుతోంది. ఫలితంగా పట్టణ స్థానిక సంస్థలు (మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు) ఇక నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్తున్నాయి. గత మున్సిపల్‌ ఎన్నికలు 2021 మార్చి 10న జరిగాయి. అదే నెలలో కొత్త పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేశాయి. ఐదేళ్ల అనంతరం వీటి పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలన్నీ ఇక నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే గత వారంలో మున్సిపాల్టీలకు ప్రత్యేకాధికారులను నియమించింది. ఇప్పటి వరకూ తమకు చేరువగా ఉండే కౌన్సిలర్లకు ఆయా వార్డుల్లోని ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేవారు. వారి ద్వారా పరిష్కారానికి ప్రయత్నించేవారు. ఇప్పుడు వారి పదవీ కాలం ముగిసిపోవడంతో ఇక నుంచి ఏ సమస్య ఉన్నా అధికారుల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. చంద్రబాబు ప్రత్యేక అధికారుల పాలనకే మక్కువ చూపిస్తారని, అందువలన మరో ఏడాది పాటు మున్సిపల్‌ ఎన్నికలు జరిగే అవకాశం లేదనే ప్రచారం కూటమిలో విస్తృతంగా జరుగుతోంది.

చంద్రబాబు సర్కారు వచ్చాక..

గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి అన్ని మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్‌ సీపీ పాలకవర్గాలే అధికారంలో ఉన్నాయి. వాటిపై మున్సిపాలిటీలపై ప్రభుత్వం కన్ను వేసింది. ఆయా పట్టణాల అభివృద్ధికి నిధులివ్వాలన్నా, పనులు జరగాలన్నా తమ పార్టీలోకి రావాలని వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారు. అయినప్పటికీ లొంగకపోవడంతో దమన నీతిని ఉపయోగించారు.

పోలీసు కేసులు, గూండాగిరీతో భయపెట్టి, యుద్ధ వాతావరణం సృష్టించి, ప్రలోభాలకు గురి చేసి తుని మున్సిపాలిటీ, ఏలేశ్వరం నగర పంచాయతీల్లో పైచేయి సాధించగలిగారు. కానీ, పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలుల్లో ఆ దుష్ప్రయత్నాలు ఫలించలేదు. అక్కడ వైఎస్సార్‌ సీపీ పాలకవర్గాలే కొనసాగడంతో వారికి ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరనే తప్ప ఎటువంటి సహకారమూ లభించలేదు. ప్రజాస్వామిక విలువలకు విరుద్ధంగా.. తమ అధికారాలను ప్రభుత్వం తుంగలో తొక్కి, అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పురపాలన సాగించిందని పాలక వర్గాలు ఆరోపించాయి. మూడేళ్ల పాటు మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో నడిపించిన పాలక వర్గాలు.. కూటమి నేతల అప్రజాస్వామిక ధోరణితో గత 20 నెలలుగా కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమవ్వాల్సిన దుస్థితి నెలకొంది. పదవీ కాలానికి చివరి రోజైన మంగళవారం ఆయా మున్సిపాలిటీ పాలక వర్గాలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాయి. పట్టణాలను అభివృద్ధి చేసే అవకాశాన్ని ప్రభుత్వం తమకు ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం

ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు సహకరించాలి. అలా కాకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది? పదవీ కాలం అయిపోతే ఇక మాదే రాజ్యం అనుకోవడం కూడా పొరపాటే. పదవి ఉన్నా, లేకపోయినా ప్రజల తరఫున పోరాడతాం. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేశాం. ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా మా బాధ్యతలు నిర్వర్తించాం. ఈ 20 నెలలూ ఇబ్బంది పడినా గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీతా విశ్వనాథ్‌ అందించిన ప్రోత్సాహం, సహకారం చాలా సంతృప్తినిచ్చాయి. అదే సంతృప్తితో పదవీ విరమణ చేశాం.

– గండేపల్లి సూర్యావతి,

మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, పిఠాపురం

అభివృద్ధి చేశామన్న సంతృప్తితోనే..

గడచిన ఐదేళ్లుగా ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలూ చేశామన్న సంతృప్తితోనే ఉన్నాం. వైఎస్సార్‌ సీపీ మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీలోనే కొనసాగాం. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేశాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధి చేశామనే సంతృప్తితోనే పదవీ విరమణ చేశాం.

– గండ్రేటి మంగతాయారు, మాజీ చైర్‌పర్సన్‌, గొల్లప్రోలు నగర పంచాయతీ

ప్రత్యేకాధికారులు వీరే..

పిఠాపురం పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (పాడా) ప్రాజెక్ట్‌ డైర్టెర్‌

పెద్దాపురం ఆర్‌డీఓ

సామర్లకోట కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌

తుని కాకినాడ ప్రభుత్వాసుపత్రి పరిపాలనాధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌

గొల్లప్రోలు నగర పంచాయతీ ఫారెస్టు సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌

ఏలేశ్వరం నగర పంచాయతీ గృహ నిర్మాణ శాఖ పీడీ

పిఠాపురంలో ఎమ్మెల్యే లేకుండానే..

సాధారణంగా మున్సిపల్‌ సమావేశాలకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా హాజరవుతూంటారు. ఆ సందర్భంగా కౌన్సిలర్లు ఆయా మున్సిపాలిటీల్లోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించుకుని, అభివృద్ధి పనులు నిర్వహిస్తూంటారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ కూటమి ఎమ్మెల్యేల నుంచి సహాయ నిరాకరణ ఎదురైనప్పటికీ కౌన్సిల్‌ సమావేశాలకు మాత్రం వారు హాజరయ్యారు. కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాత్రం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాలకు కనీసం ఒక్కసారి కూడా హాజరు కాలేదు. దీనిపై పలు సందర్భాల్లో పాలకవర్గ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement