ఫ తిరుమల ప్రతిష్టను మంటగలిపారు
ఫ ఆయనపై చర్యలు తీసుకోవడంలో
చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం
ఫ శాంతియుత నిరసన తెలిపితే
దాడులు అమానుషం
ఫ వైఎస్సార్ సీపీ నేతల ఆందోళన
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బ తీసిన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. నాయుడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. తిరుపతిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వైఎస్సార్ సీపీ మహిళా కార్యకర్తలపై టీడీపీ నాయకులు, గూండాలు దాడి చేయడాన్ని ఖండిస్తూ.. కాకినాడ ఇంద్రపాలెం సెంటర్‌లో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఆందోళన నిర్వహించాయి. ఇంద్రపాలెం వంతెన వద్ద మహిళలు, పార్టీ మహిళా నేతలు రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. చంద్రబాబు డౌన్‌డౌన్.. నాయుడిని తొలగించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ నాయుడిని ఆ పదవిలో కొనసాగించడం రాష్ట్ర ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. తప్పులు చేసేసి, వాటిపై ప్రశ్నిస్తున్న మహిళలపై దాడులకు దిగడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తిరుపతిలో మహిళలపై జరిగిన దౌర్జన్యమే దీనికి నిదర్శనమన్నారు. బీఆర్ నాయుడిని తక్షణమే టీడీపీ చైర్మన్ పదవి నుంచి తొలగించి, ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ వంగా గీత, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలన్నారు. ప్రశ్నించే వారందరినీ రెడ్‌బుక్ రాజ్యాంగంతో, పోలీసు అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మహిళల రక్షణ కోసం దిశ చట్టంతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తోట నరసింహం, పెద్దాపురం, ప్రత్తిపాడు కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తోట రామ్‌జీ, జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, మాకినీడి శేషుకుమారి, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


