రుణాలు వేగంగా మంజూరు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రుణాలు వేగంగా మంజూరు చేయాలి

Mar 18 2026 11:17 AM | Updated on Mar 18 2026 11:17 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రైతులు, స్వయం సహాయక సంఘాలు, యువతకు రుణాల మంజూరును వేగవంతం చేయాలని బ్యాంకు అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ కోరారు. ప్రభుత్వ పథకాల లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకర్లు, జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.26,408 కోట్లు కాగా, ఇప్పటి వరకూ రూ.26,074.5 కోట్ల మేర రుణాలిచ్చి, 98.73 శాతం లక్ష్యం సాధించారని తెలిపారు. వ్యవసాయ రంగంలో స్వల్పకాలిక రుణాల లక్ష్యం రూ.13,733 కోట్లు కాగా, రైతులకు రూ.12,632 కోట్లు పంపిణీ చేశారన్నారు. రానున్న రోజుల్లో పంట రుణాల మంజూరును మరింత వేగవంతం చేయాలని బ్యాంకర్లకు సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్‌డీఏ) ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 10,186 డ్వాక్రా సంఘాలకు రూ.1,298.71 కోట్లు, మెప్మా ద్వారా 2,737 పట్టణ సంఘాలకు రూ.420.52 కోట్ల మేర రుణాలు ఇచ్చారని తెలిపారు. 3,526 మంది మహిళా పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు రూ.55.55 కోట్ల రుణాలు అందించారని జేసీ తెలిపారు. అనంతరం, రూ.23,598 కోట్లతో నాబార్డ్‌ రూపొందించిన 2026–27 వార్షిక రుణ ప్రణాళికను ఎల్‌డీఎం, నాబార్డ్‌ ఎల్‌డీఎం తదితరులతో కలిసి ఆయన విడుదల చేశారు.

నవోదయ ప్రవేశ పరీక్షలో 33వ ర్యాంక్‌

కరప: నవోదయ ప్రవేశ పరీక్షలో యండమూరు విద్యార్థిని గుబ్బల అవంతిక జిల్లా స్థాయిలో 33వ ర్యాంక్‌ సాధించింది. యండమూరులోని మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఆమె ఇటీవల నవోదయ ప్రవేశ పరీక్ష రాసింది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆమె ఈ ర్యాంక్‌ సాధించిందని ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎ.కామేశ్వరరావు, ఎంఏ అలీమ్‌ తెలిపారు. అవంతికను సర్పంచ్‌ మారెళ్ల శివ, ఎంఈఓలు కె.బుల్లికృష్ణవేణి, పి.సత్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు.

మహాశివరాత్రికి రూ.34.34 లక్షల ఆదాయం

సామర్లకోట: పంచారామ క్షేత్రమైన బాలాత్రిపురసుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా రూ.34,34,739 ఆదాయం వచ్చిందని ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌ 9 నుంచి మంగళవారం వరకూ 160 రోజులకు గాను దేవదాయ శాఖ తనిఖీదారు ఫణికుమార్‌ పర్యవేక్షణలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. హుండీల ద్వారా రూ.18,23,194, మహాశివరాత్రి నాడు స్వామి వారి దర్శన టికెట్ల ద్వారా రూ.8,65,140, కానుకలు రూ.33,701, ప్రసాద విక్రయం ద్వారా రూ.3,43,825, ఆర్జిత సేవల ద్వారా రూ.36,116, స్వామి వారి ఫొటోల అమ్మకం ద్వారా రూ.105, అన్నదాన విరాళాలు రూ.3,32,658 వచ్చాయని ఈఓ వివరించారు. గత ఏడాది హుండీల ఆదాయంతో కలిపి రూ.29,66,406 ఆదాయం వచ్చిందని చెప్పారు. ఆదాయం లెక్కింపులో ఉత్సవ కమిటీ చైర్మన్‌ కంటే జగదీష్‌ మోహన్‌రావు, ట్రస్టు బోర్డు సభ్యులు, ఆలయ సూపరింటెండెంట్‌ ఈశ్వరరావు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తసంఘ సభ్యులు, ఉండూరు, జగ్గంపేట సేవా సంఘం సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

సైకత శిల్పి శ్రీనివాస్‌కి

జీవన సాఫల్య పురస్కారం

రంగంపేట: స్థానిక సైకత శిల్పి దేవిన శ్రీనివాస్‌ను ఉగాది జీవ న సాఫల్య పురస్కారం వరించింది. హైదరాబాద్‌ కు చెందిన విపంచి ఫౌండేషన్‌ ఉగాదిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో నిష్ణాతులకు జీవన సాఫల్య పురస్కారాలను అందజేస్తోంది. సైకత శిల్ప కళ ద్వారా సమాజ చైతన్యానికి కృషి చేస్తున్నందుకు శ్రీనివాస్‌కు అందజేయనుంది. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ పురస్కారం శ్రీనివాస్‌ అందుకోనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం సంస్థ జ్యూరీ కమిటీ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement