డ్రోన్ కెమెరాకు చిక్కిన పులి సంచారం
● పులి దోబూచులాట
● రంగంలోకి 11 హనుమాన్ బృందాలు
● ఏ క్షణంలోనైనా బంధించే అవకాశం
● ఏ
ప్రత్తిపాడు రూరల్/శంఖవరం: పులి దోబూచులాటకు తెర పడటం లేదు. రోజుకో రూటు మారుస్తూండటంతో దానిని పట్టుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించడం లేదు. దీంతో, ఎడతెగని సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ పులి శంఖవరం నుంచి ఆదివారం తాళ్లపాలెం, మండపం గ్రామాల మధ్య ఉన్న కొండ పైకి చేరింది. అక్కడ ఓ గేదె దూడను హతమార్చింది. అక్కడి నుంచి సోమవారం జి.కొత్తపల్లి నల్లకొండమ్మ తల్లి ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొండ పైకి చేరింది. అక్కడి నుంచి తిరిగి మాసంపల్లి వైపు వెళ్లిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జి.కొత్తపల్లి, మాసంపల్లి, రాజారం, గొంది, అచ్చింపేట తదితర గ్రామాల్లో అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.
నిరంతర పర్యవేక్షణ
కొన్నాళ్లుగా ప్రత్తిపాడు, శంఖవరం మండలాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ఈ పులిని ఎలాగైనా పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, అటవీ దళాల అధిపతి పీవీ చలపతిరావు, ప్రధాన అటవీ సంరక్షణాధికారి శ్రీకంఠనాథరెడ్డి, జిల్లా అటవీ అధికారి ఎన్.రామచంద్రరావు స్వీయ పర్యవేక్షణలో పులి కదలికలను 11 హనుమాన్ బృందాలు క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. వీటిలో 3 ట్రాంక్విలైజింగ్, 2 డ్రోన్, వీహెచ్‌ఎఫ్ సిగ్నల్ స్వీకరణ బృందాలతో పాటు రాజమహేంద్రవరం, ఏలేశ్వరం, కాకినాడలకు చెందిన నాలుగు ర్యాపిడ్ రెస్పాన్స్ – రెస్క్యూ బృందాలున్నాయి. పులిని బంధించేందుకు అది సంచరిస్తున్న ప్రాంతంలో ఈ బృందాలు మోహరించాయి. విశాఖపట్నంలోని జూ పార్కు నుంచి తీసుకువచ్చిన వన్యప్రాణి అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. పులి సంచరిస్తున్న పరిసర గ్రామాల్లో పర్యటించి ఒకవైపు ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా, మరోవైపు పులి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేయడంలో భాగస్వాములవుతున్నారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు చలపతిరావు, శ్రీకంఠనాథరెడ్డి ఆయా ప్రాంతాలను సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. సరైన సమయం, సరైన ప్రదేశంలో పులిని సురక్షితంగా పట్టుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. పులి కదలికలపై రాత్రి వేళ కూడా డ్రోన్లతో నిఘా కొనసాగిస్తున్నారు. ఏలేశ్వరం, కాకినాడ అటవీ రేంజ్ అధికారులు దుర్గా రాంప్రసాద్, శ్రీదీప్తి, కోరంగి వైల్డ్ లైఫ్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అటవీ అధికారులు, సిబ్బంది భారీ ఎత్తున తరలివచ్చి పరిస్థితిని సమీక్షించారు.


