గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
కరప: స్థానిక మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకూ చదివేందుకు అర్హులైనవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రిన్సిపాల్ కేవీ కృష్ణారావు కరపలో గురువారం విలేకర్లతో మాట్లాడుతూ ఈ వివరాలు తెలిపారు. ఆయా తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో https://mjpapbcwreis.apcfss.in వెబ్‌సైట్ ద్వారా మార్చి నాలుగో తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదో తరగతిలో ప్రవేశం కోరే వారికి ఏప్రిల్ 12వ తేదీన ఉదయం, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశానికి ఏప్రిల్ 19వ తేదీ మధ్యాహ్నం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు 80749 75154, 99493 84806, 99491 84141 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని కృష్ణారావు కోరారు.
మరిడమ్మ ఆలయానికి
రూ.27 లక్షల ఆదాయం
సామర్లకోట: పెద్దాపురం మరిడమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి సమర్పించే గాజులు, చీరలు, జాకెట్టు ముక్కల విక్రయం ద్వారా దేవస్థానానికి రూ.27.45 లక్షల ఆదాయం వచ్చిందని ఈఓ కె.జయలక్ష్మి తెలిపారు. ఆలయంలో రెండేళ్ల పాటు గాజులు, చీరలు, జాకెట్టు ముక్కలతో పాటు కోడి, మేకపోతులను విక్రయించుకుని, తీసుకునే హక్కు కోసం గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. కోడి, మేకపోతులకు పాటదారులు హాజరు కాలేదు. దీంతో, ఈ పాటను వాయిదా వేశామని ఈఓ తెలిపారు. మొదటి సంవత్సరం పాటకు రెండో ఏడాది 10 శాతం కలిపి, ఆలయానికి పాటదారు రూ.30,19,500 చెల్లించాల్సి ఉంటుందని ఈఓ తెలిపారు. బహిరంగ వేలంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చింతపల్లి హర్ష, పెద్దాపురం గ్రూప్ టెంపుల్ ఈఓ కె.జగదీశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
భీమేశ్వరుని హుండీల
ఆదాయం రూ. 27.46 లక్షలు
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ హుండీల ఆదాయం రూ. 27,46,616 వచ్చినట్లు ఈఓ, దేవదాయ శాఖ ఏసీ అల్లు వెంకట దుర్గాభవాని గురువారం విలేకరులకు తెలిపారు. గత ఏడాది నవంబర్ 27వ తేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆలయ హుండీల నుంచి రూ.26,59,090, అన్నదానం హుండీల నుంచి రూ.87,526 వచ్చినట్లు పేర్కొన్నారు. ఈఓతో పాటు అంగర గ్రూపు టెంపుల్స్ ఈఓ ఎం.శ్రీదేవి, ఓదూరు గ్రూపు టెంపుల్స్ ఈఓ విత్తనాల శ్రీనివాస్, కె.గంగవరం గ్రూపు టెంపుల్స్ ఈఓ వి.బాలకృష్ణల పర్యవేక్షణలో లెక్కింపు సాగింది. ద్రాక్షారామ పీఏసీఎస్ చైర్మన్ ముప్పనపల్లి గణేష్, గ్రామ పెద్దలు దవులూరి రామకృష్ణ, అల్లం రామకృష్ణ, ఆళ్ల బుజ్జి, సలాది శ్రీను పాల్గొన్నారు. ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.


