భార్య ఆత్మహత్య కేసులో వ్యక్తి అరెస్ట్
కాకినాడ క్రైం: మనస్తాపంతో ఈ నెల 2న ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల ప్రకారం.. అనుమలశెట్టి లక్ష్మీదీప్తి (36), తన భర్త జగదీష్ కుమార్‌తో కలసి తణుకులో నివాసం ఉంటోంది. భర్త బాధ్యతా రాహిత్యం, మరో వివాహం చేసుకున్నాడనే ఆరోపణలు, అప్పుల నేపథ్యంలో నిత్యం గొడవలు జరుగుతుండేవి. దీంతో లక్ష్మీదీప్తి మనస్తాపం చెంది కాకినాడ రామారావుపేటలోని పుట్టింటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 2న ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు, కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జగదీష్‌ను గురువారం అరెస్టు చేశారు.
సూసైడ్ నోట్ రాసి
వ్యక్తి అదృశ్యం
సీతానగరం: తనకు అప్పులు ఉన్నాయని ఇంట్లో సరిగ్గా చూడడం లేదని, సూసైడ్ నోట్ రాసి తన భర్త కుమ్మరి కృపానందం ఎక్కడికో వెళ్లిపోయాడని అమూల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై డి.రామ్‌కుమార్ గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 10న ఉదయం రఘుదేవపురం గ్రామానికి చెందిన కృపానందం (36) ఇంట్లో సూసైట్ నోట్ పెట్టి బయటకు వెళ్లిపోయాడు. ఆ నోట్‌లో అప్పులు ఎక్కువగా ఉన్నాయని ఇంట్లో తనను సరిగా చూడటం లేదని, రెండు మొక్కులు ఉన్నాయని, వాటిని తీర్చి చనిపోతానని కృపానందం రాశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఒంటిపై గ్రీన్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని ఆచూకీ తెలిసిన వారు కోరుకొండ సీఐ 94409 04829, సీతానగరం ఎస్సై 94409 04832 నంబర్లకు తెలపాలని ఎస్సై వివరించారు.
వీఆర్వో ఆత్మహత్యాయత్నం
గొల్లప్రోలు (పిఠాపురం): గొల్లప్రోలు మండల తహసీల్దార్ వేధిస్తున్నారంటూ ఓ వీఆర్వో కార్యాలయం ముందే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన గురువారం గొల్లప్రోలులో కలకలం రేపింది. బాధితుడు, స్థానికుల కథనం ప్రకారం.. గొల్లప్రోలు నగర పంచాయతీ 6వ సచివాలయంలో పరమేశ్వరరాజు వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ రామ్‌కుమార్ తనపై పని ఒత్తిడి పెంచుతూ మానసికంగా హింసిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా సచివాలయ విధులతో పాటు అదనంగా దుర్గాడ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. ఎంత చెప్పినా వినకుండా తనపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపిస్తూ పరమేశ్వరరాజు గురువారం తహసీల్దార్ కార్యాలయం బయట నిద్రమాత్రలు మింగారు. గమనించిన తోటి సిబ్బంది, స్థానికులు వెంటనే ఆయనను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఎస్‌సీసీలో
‘ప్రగతి’ విద్యార్థుల ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జాతీయ, రాష్ట్ర స్థాయి ఎన్‌సీసీ పరేడ్‌లో తమ కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థులు సత్తా చాటారని చూపారని ప్రగతి కళాశాల చైర్మన్ పరుచూరి కృష్ణారావు గురువారం తెలిపారు. ఢిల్లీలో గత నెల 29 వరకూ నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఈఈఈ ఆఖరి సంవత్సర విద్యార్థి వీవీఎస్‌కేఆర్ సంజీవ్ పీఏం ర్యాలీ, బీటెక్ డేటా సైన్స్ తృతీయ సంవత్సర విద్యార్థి పి.నాగశ్రీ కర్తవ్యపద్‌లో పాల్గొని ప్రతిభ చూపారన్నారు. రాష్ట్ర స్థాయిలో అమరావతిలో నిర్వహించిన సీఎం కవాతులో బీటెక్ డేటా సైన్స్ విద్యార్థి సీహెచ్ సాయిరమ్య ప్రతిభ చూపారన్నారు. అలాగే బీటెక్ నాల్గో సంవత్సర ఈసీఈ విద్యార్థి ఎం.శ్రీభాను మహారాష్ట్రలో గత ఏడాది నిర్వహించిన ఇంటర్ డైరెక్టరేట్ స్పోర్ట్స్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ చాటి ఢిల్లీ స్టేట్ షూటింగ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిందన్నారు. విద్యార్థులకు విద్య, ఉపాధి కల్పించడంతో పాటు నాయకత్వ, క్రమశిక్షణ పట్ల ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. విద్యార్థుల బృందాన్ని కళాశాల డైరక్టర్ ఎంవీ హరినాథబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, అకడమిక్ డైరెక్టర్ కె.సత్యనారాయణ, ప్రిన్సిపాల్ జి.నరేష్ అభినందించారు.
భార్య ఆత్మహత్య కేసులో వ్యక్తి అరెస్ట్
భార్య ఆత్మహత్య కేసులో వ్యక్తి అరెస్ట్


