ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

Feb 10 2026 7:52 AM | Updated on Feb 10 2026 7:52 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌  విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

ఎస్‌ఎఫ్‌ఐ నేతల డిమాండ్‌

కలెక్టరేట్‌ వద్ద నిరాహార దీక్ష

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యాన కలెక్టరేట్‌ వద్ద సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌ లోవరాజు, ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ, అధికారంలోకి రాక ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని మండిపడ్డారు. ప్రస్తుతం విద్యా శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్‌ యువగళం పాద యాత్రలో విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని, ఇప్పుడు ఆ మాట ఏం చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.7 వేల కోట్లున్నాయని, దీనిని విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలు విద్యార్థులను మిడ్‌, సెమిస్టర్‌ పరీక్షలకు హాజరు కానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు చెల్లించిన వారికే హల్‌ టికెట్లు మంజూరు చేస్తామంటూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పారు. తొలుత సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడుతూ, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ, నిరాహార దీక్షకు చరిత్రలో చాలా ప్రాధాన్యం ఉందని, ఇటువంటి దీక్షలతో దేశ స్వాతంత్య్రంతో పాటు ఎన్నో విజయాలు సాధించామని గుర్తు చేశారు. జనవి/్ఞాన వేదిక జిల్లా నాయకుడు రెడ్డి కూడా ప్రసంగించారు. ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్‌లు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement