డీఆర్‌ఓగా తిప్పేనాయక్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌ఓ)గా డి.తిప్పేనాయక్ కలెక్టరేట్‌లోని తన చాంబర్లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2024 ఎన్నికల సమయంలో డీఆర్‌ఓగా ఇక్కడ బాధ్యతలు నిర్వహించి, బదిలీపై అనంతపురం జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా వెళ్లారు. అక్కడ సుమారు 14 నెలల పాటు పని చేసి, తిరిగి జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా తిప్పేనాయక్‌ను కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు.
12న దేశవ్యాప్త సమ్మె
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలనే డిమాండుతో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 12న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో తామూ పాల్గొంటున్నామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (ఏపీఎంఎస్‌ఆర్‌యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.వెంకట్రావు తెలిపారు. సమ్మె పోస్టర్‌ను కలెక్టరేట్ వద్ద ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాత కార్మిక చట్టాలే అంతంత మాత్రంగా అమలవుతున్న పరిస్థితుల్లో కొత్త లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులకు మరింతగా అన్యాయం జరుగుతుందని అన్నారు. తమకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్‌ను కూడా కొత్త లేబర్ కోడ్ ద్వారా రద్దు చేశారని చెప్పారు. రూ.18 వేల జీతం దాటిన వారు కార్మికులే కాదని, వారికి ఎటువంటి చట్టాలూ వర్తించవని పేర్కొన్నారని తెలిపారు. మెడికల్ రిప్స్‌కు నిర్దిష్ట పని పద్ధతులుండాలని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధానాలు అరికట్టాలని కోరుతున్నామన్నారు. యూనియన్ కాకినాడ బ్రాంచి కార్యదర్శి సీహెచ్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, మెడికల్ రిప్స్ నిరంతరం యాజమాన్యాల వేధింపులకు గురవుతూంటారని చెప్పారు. లేబర్ కోడ్‌ల వల్ల వీరిపై ఒత్తిడి మరింత పెరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, పని గంటలు పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, బ్రాంచి అధ్యక్షుడు ఎంఏ స్వామి పాల్గొన్నారు.
ఉత్సాహంగా సైక్లాథాన్
కాకినాడ రూరల్: ఓఎన్జీసీ ఆధ్వర్యాన సైక్లాథాన్ ఆదివారం ఉత్సాహంగా సాగింది, సాక్ష్యం కార్యక్రమంలో భాగంగా రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలోని ఓఎన్జీసీ హెచ్‌టీపీ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని అసెట్ మేనేజర్ ప్రబల్‌సేన్ గుప్తా బెలూన్లు గాలిలోకి విడిచిపెట్టి, జెండా ఊపి ప్రారంభించారు. ఏపీఐఐసీ కాలనీ నుంచి సర్పవరం జంక్షన్ స్పెన్సర్స్ షాపు వరకూ, అక్కడి నుంచి తిరిగి ఓఎన్జీసీ హెచ్‌టీపీ కార్యాలయం వరకూ సైక్లాథాన్ సాగింది. ఇందులో ఓఎన్జీసీ సిబ్బంది, అధికారులు, మహిళలు, చిన్నారులు, గోదావరి, కాకినాడ సైక్లింగ్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రబల్‌సేన్ గుప్తా మాట్లాడుతూ, అంతరించిపోతున్న సంప్రదాయ ఇంధన వనరులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకోవాలని కోరారు. ఈస్ట్రన్ ఆఫ్‌షోర్ అసెట్ మేనేజర్ రజిత్ మల్హోత్రా, హెచ్‌ఆర్ సునీల్ కుమార్, మహ్మద్ రఫీ పాల్గొన్నారు.
తలుపులమ్మ సన్నిధికి పోటెత్తిన భక్తులు
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యేక వాహనాల్లో లోవకు తరలివచ్చారు. అమ్మవారిని క్యూలో 15 వేల మంది దర్శించుకున్నారని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయాల ద్వారా రూ.1,80,455, పూజా టికెట్లకు రూ.2,40,090, తలనీలాలకు రూ.10,240, వాహన పూజలకు రూ.8,850, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.52,800, విరాళాలు రూ.48,759 కలిపి మొత్తం రూ.5,41,194 ఆదాయం లభించిందని వివరించారు.
డీఆర్‌ఓగా తిప్పేనాయక్
డీఆర్‌ఓగా తిప్పేనాయక్


