గట్టుకాయస్వాహా!
కె.గంగవరం: గోదావరి ఏటిగట్టును దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.వందల కోట్ల వ్యయంతో పటిష్టం చేశారు. ప్రస్తుతం దానిని ఇష్టమొచ్చినట్టు తవ్వేసి గుల్ల చేసేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో కూళ్ల నుంచి యానం వరకు గౌతమి గోదావరి నది ఒడ్డు ఉంది. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోదావరికి వరద వచ్చినప్పుడు ముంపు గ్రామాల్లోని నీరు చేరకుండా ఏటిగట్టును ఐదు అడుగులకు పెంచారు. జొన్నడ నుంచి గొవలంక వరకు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ పనులు చేయించారు. ప్రస్తుతం పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఏటిగట్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఏటిగట్టుపై ఉన్న మట్టిని కొందరు రాత్రివేళల్లో తవ్వేసి పట్టుకుపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన సంక్రాంతి కోడి పందేల కోసం బోదిలంక వద్ద ఏటిగట్టును రెండు చోట్ల తవ్వేసి రోడ్డును ఏర్పాటు చేశారు. దీంతో పాటు అనధికారిక ఇసుక ర్యాంపు కోసం కూడా కూళ్ల నుంచి బ్రహ్మపురి వరకు పలు చోట్ల గట్టును తవ్వి ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారుల నిర్లక్ష్యంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. గట్టును విచ్చలవిడిగా తవ్వేసి రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల దాని మనుగడ ప్రశ్నర్ధకమైంది. వరదలు వచ్చినప్పుడు హడావిడి చేయడం తప్ప మామూలు రోజుల్లో ఏటిగట్టును పట్టించుకునే నాథుడు లేడని గోదావరి పరీవాహక ప్రజలు వాపోతున్నారు. అటు కన్జర్వెన్సీ అధికారులు కానీ, ఇటు స్థానిక రెవెన్యూ అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని గట్టును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.


