పుష్కరిణి.. పట్టని ధోరణి
ఫ పాదగయలో కో‘నీటి’ కష్టాలు
ఫ లక్షల మంది పుణ్యస్నానాలతో
కలుషితం
ఫ నీరు బయటకు పోయే
ఏర్పాట్లు అవశ్యం
పిఠాపురం: దేశంలోనే పేరున్న శైవక్షేత్రం.. త్రిగయలలో ఒకటైన పిఠాపురం పాదగయలో అతి పవిత్రమైన పుష్కరిణి భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోంది. అంతటి ప్రాధాన్యం ఉన్న పుష్కరిణి ముఖ్యమైన పర్వదినాల్లో కంపు కొడుతోంది.. ఏటా దసరా, మహా శివరాత్రి పర్వదినాల్లో ఈ సమస్య తలెత్తుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై భక్తుల్లో ఆందోళన నెలకొంది. పాదగయ క్షేత్రంలోని పుష్కరిణిలో స్నానమాచరించడం పితృ ముక్తికరం, సర్వపాప హరం, సర్వాభీష్ట సిద్ధి ప్రదం అనే నానుడి ఉండడంతో, దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. భారత దేశంలోని బీహార్ రాష్ట్రంలో శిరోగయ ఉండగా, ఒడిశా రాష్ట్రంలో నాభిగయ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో పాదగయ ఉంది. త్రిగయ క్షేత్రాల్లో పాదగయకు విశిష్టత ఉంది. ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన దైవం కావడం, పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం ఉండటంతో ఈ క్షేత్రానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. స్వయం భూ శివ క్షేత్రంగా విరాజిల్లుతోంది. దీనిని వ్యాస మహర్షి స్వయంగా దర్శించుకున్నట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. మహా శివరాత్రి రోజుల్లో ఇక్కడ స్నానమాచరించని వారే ఉండరు.
ఇలా చేస్తే మేలు..
పవిత్రమైన పాదగయ పుష్కరిణిలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పాత నీరు పోయి కొత్త నీరు వచ్చే విధంగా చూడాలి. కలుషిత వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించాలి. పిండ ప్రదాన సామగ్రి బయటకు పోయే ప్రదేశాల్లోనే నిమజ్జనం చేసే విధంగా చూడాలి.
ఉత్సవాలు పూర్తయ్యే వరకూ నీటి పారుదలపై దృష్టి సారించి, పుష్కరిణి పవిత్రతను కాపాడాలి. రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి.
ఒక్క రోజులోనే కలుషితం
పాదగయ క్షేత్రంలోని పుష్కరిణిలో ప్రతి 10 నిమిషాలకు సుమారు వెయ్యి మందికి పైగా స్నానాలు ఆచరిస్తారని అంచనా. మహా శివరాత్రి రోజున ఈ పుష్కరిణిలో సుమారు 1.50 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇది పారే నది, ఏరు కాకపోవడంతో పాటు దీనికితోడు భక్తులు పితృ కార్యక్రమాలు చేసి పిండాలు, అరటి పండ్లు, డొప్పలు వదిలి పెట్టడంతో నీరు తొందరగా కలుషితమవుతుంది. సుమారు 24 గంటల పాటు నిర్విరామంగా భక్తుల తాకిడి ఉండి లక్షల్లో స్నానాలు ఆచరించడంతో నీరు పాడైపోతోంది. దీంతో మరుసటి రోజుకే దానిలో వేసిన వ్యర్థాలు కుళ్లి నీరు మురికి నీరుగా మారి దుర్గంధం వెదజల్లుతోంది. ఏటా ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఉత్సవాల్లో భాగంగా శివరాత్రి తరువాత స్వామివారికి నిర్వహించే త్రిశూల స్నానం పుష్కరిణిలో చేయించాల్సి ఉండగా, నీరు కంపు కొడుతుండటంతో కుళాయి నీటితో చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు చెత్తను తీయించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ౖపైపె చెత్త మాత్రమే తొలగిస్తుండగా, నీటి అడుగుకు చేరిన పిండ వ్యర్థాలు మాత్రం నీటిని కలుషితం చేస్తుంటాయి. దీంతో కేవలం ఒక్క రోజులోనే పుష్కరిణి పుణ్యస్నానాల మాట అటుంచితే, కనీసం కాళ్లు కడుగుకోవడానికి కూడా పనికిరాకుండా మారిపోతుంటాయి. దాని పక్క నుంచి కూడా వెళ్లలేనంతగా దుర్గంధం వెదజల్లుతుంది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం
పుష్కరిణి నీరు ఒక రోజులోనే కలుషితం అవుతుంది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. పెద్ద బోర్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కొత్త నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. అలాగే పాత నీరు బయటకు పంపే ఏర్పాట్లు చేపట్టాం. కలుషిత పదార్థాలను ఎప్పటికప్పుడు ఏరి వేసేలా చూస్తున్నాం. ఐదు రోజుల పాటు నీరు కలుషితం కాకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నాం. భక్తులు కూడా తమకు సహకారం అందించాలి. –కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, ఈఓ, పిఠాపురం పాదగయ క్షేత్రం
పుష్కరిణి.. పట్టని ధోరణి


