యాస్ట్రో టర్ఫ్ హాకీ మైదానాలు ఏర్పాటు చేయాలి
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి హాకీ అభివృద్ధి చెందాలంటే ప్రతి జిల్లాలో యాస్ట్రో టర్ఫ్ హాకీ మైదానాలు ఏర్పాటు చేయాలని ఒలింపియన్, మాజీ ఇండియన్ టీమ్ గోల్ కీపర్ రజని తెలిపారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న జాతీయ స్థాయి మొదటి గోల్డ్‌కప్ హాకీ పోటీలను శనివారం తిలకించేందుకు తిరుపతి నుంచి ఆమె విచ్చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె తన క్రీడానుభవాలు పంచుకున్నారు. తిరుపతి జిల్లాకు చెందిన తనను పీఈటీ వెంకటరాజు, ప్రసన్నకుమార్‌లు గుర్తించి క్రీడాల్లో ప్రోత్సహించారన్నారు. 2007లో తొలిసారి జూనియర్ నేషనల్స్ ఆడానని, 2009లో జాతీయ జట్టుకు ఎంపికై నట్లు తెలిపారు. 2013 నుంచి 2024 వరకూ ఏసియా కప్, ఏసియన్ చాంపియన్‌షిప్ ట్రోఫీ, వరల్డ్ కప్, కామన్ వెల్త్‌గేమ్స్, రియో ఒలింపిక్స్, ఏసియన్ గేమ్స్‌లో బంగారు, రజత, కాంస్య పతకాలు సాఽధించానన్నారు. కాకినాడలో జాతీయ స్థాయి పోటీలు ఈ స్థాయిలో నిర్వహిస్తున్న కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్‌ను ఆమె అభినందించారు. భవిష్యత్తులో కాకినాడ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారు కావడానికి ఇదో చక్కని వేదిక అన్నారు. విశాఖ, తిరుపతి, కాకినాడలో హాకీ యాస్ట్రో టర్ఫ్ మైదానాలు ఉన్నాయని, ప్రభుత్వం ప్రతి జిల్లాలో హాకీ మైదానాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కాకినాడలో జరుగుతున్న పోటీల్లో దేవేష్, దీపక్, రాఘవన్ వంటి జాతీయ, అంర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఆడుతున్నారని, వర్ధమాన క్రీడాకారులు వీరి నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్నారు. సాధించాలనే పట్టుదల, అంకితభావం, నేర్చుకోవాలనే తపన ఉంటే ఏ క్రీడలోనైనా రాణించవచ్చన్నారు.


