ఊరెళ్లారని తెలుసుకుని ఉన్నదంతా ఊడ్చేశారు!
దుర్గాడలో భారీ చోరీ
పిఠాపురం: ఇంట్లో వారు ఊరెళ్లారని తెలుసుకుని గుర్తుతెలియని వ్యక్తులు, ఆ ఇంటిని కొల్లగొట్టిన సంఘటన గొల్లప్రోలు మండలం దుర్గాడలో శనివారం చోటుచేసుకుంది. భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీకి గురైంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. దుర్గాడకు చెందిన కొండేపూడి సూర్యనారాయణ తన భార్యతో కలసి పూణేలో ఉంటున్న తన కుమారుడి ఇంటికి గత 24న వెళ్లారు. వెళ్లే ముందు తన ఇంటికి తాళాలు వేసి అదే గ్రామంలో నివాసముంటున్న తన అల్లుడు వెలుగుల భాస్కరరావుకు తన ఇంటిని అప్పగించారు. అప్పటి నుంచి ఇంటిని చూస్తున్న భాస్కరరావు రోజూ బయట గేటు తాళాలు తీసి ఇంటి బయట తుడిపించడం, లైట్లు వేయించడం చేస్తున్నారు. శనివారం వచ్చి చూసేసరికి ఇంటి ప్రధాన తలుపులు తీసి ఉండడంతో అనుమానం వచ్చి లోపలకు వెళ్లి చూడగా, దొంగతనం జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. సుమారు 50 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి ఆభరణాలతో పాటు కొంత నగదు పోయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును పిఠాపురం సీఐ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు.


