సర్కారు వారి జిందాల్‌బాద్‌! | - | Sakshi
Sakshi News home page

సర్కారు వారి జిందాల్‌బాద్‌!

Feb 7 2026 9:41 AM | Updated on Feb 7 2026 9:41 AM

సర్కా

సర్కారు వారి జిందాల్‌బాద్‌!

ఆనూరులో జిందాల్‌ పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంతిళ్లు కట్టుకోవచ్చని ఆ నిరుపేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ స్వప్నం సాకారమవుతుందని భావించారు. అంతలోనే ప్రభుత్వం మారింది. ఆ స్థలాలను కొత్త ప్రభుత్వం అభివృద్ధి చేసి, తమ కలలను

నెరవేర్చుకునేందుకు పునాది వేస్తుందని లబ్ధిదారులు అనుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు వారి ఆశలకు సమాధి కడుతూ.. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌కు ఆ స్థలంలో పునాది వేయాలని సర్కారు ప్రతిపాదించింది. దీనికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది.

సాక్షి ప్రతినిధి కాకినాడ: నియోజకవర్గ కేంద్రమైన పెద్దాపురం సమీపాన కాకినాడ – రాజానగరం ఏడీబీ రోడ్డులో రామేశ్వరం మెట్ట వద్ద అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు హయాంలో 530 ఎకరాల భూమిని పేద దళితులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి ఎకరా 35 సెంట్ల చొప్పున ఇచ్చారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఆ భూమిని చదును చేసి, సాగు చేసుకునేందుకు వీలుగా లబ్ధిదారులకు ఇస్తామనే మిషతో టీడీపీ నేతలు, అప్పటి ప్రజాప్రతినిధులు అక్కడి కొండను అడ్డగోలుగా తవ్వేసి, రూ.లక్షలు దిగమింగారు. ఇక్కడ గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 250 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఆ భూమిని చదును చేసి, జగనన్న లే అవుట్‌గా అభివృద్ధి చేసి మరీ లబ్ధిదారులకు అప్పగించింది. ఈ లే అవుట్‌లో రెండో విడత ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 2024లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. అనంతరం, చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కడంతో ఈ లే అవుట్‌ను గాలికొదిలేశారు. వైఎస్సార్‌ సీపీకి ఎక్కడ పేరు వచ్చేస్తుందోననే దుర్బుద్ధితోనే ఈ జగనన్న లే అవుట్‌కు మంగళం పాడేశారని బాధితులు గొల్లుమంటున్నారు.

డీల్‌ కుదిరిందా..!

ఇదిలా ఉండగా పెద్దాపురం మండలం ఆనూరు గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్‌ 11/1, 12/3లో సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ సమీపాన ఉన్న ఈ భూమిలో చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. జిందాల్‌ సంస్థ ఏర్పాటు చేసే ఈ ప్లాంట్‌ నిర్మాణానికి 12 ఎకరాలు, దీనికి అవసరమైన డంపింగ్‌ యార్డ్‌ కోసం మరో 40 ఎకరాలు అవసరమని తేల్చారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ నేతల జోక్యం అనేక అనమానాలకు తావిస్తోంది. దీని వెనుక పెద్ద డీల్‌ కుదిరిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అలా కాకపోతే గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 250 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్దేశించి, రామేశ్వరం మెట్టలో చదును చేసిన భూమిని విద్యుత్‌ ప్లాంట్‌ కోసం ఎందుకు ప్రతిపాదిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంత మంది లబ్ధిదారుల గూడు చెడగొట్టి ప్లాంట్‌కు ధారాదత్తం చేయడంలో ఆంతర్యమేమిటని నిలదీస్తున్నారు.

గళం విప్పుతున్న బాధితులు

ఈ భూమిని విద్యుత్‌ ప్లాంట్‌కు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంపై పేదలు మండిపడుతున్నారు. తమ పొట్ట కొట్టి, పెద్దలకు దోచి పెట్టడమేమిటని ప్రశ్నిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యాన ఉద్యమిస్తున్నారు. ఇక్కడ చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ ఏర్పాటు వలన కాలుష్యం కాటేస్తుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం గళం విప్పుతున్నారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతూ, పంటలను నాశనం చేసే, పర్యావరణానికి ముప్పుగా మారే ఈ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు యత్నాలను విరమించుకోవాలనే డిమాండ్‌తో కొంత కాలంగా ఏపీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యాన ఉద్యమిస్తున్నారు. ఈ ప్లాంట్‌ నిర్మిస్తే వెలువడే వాయు కాలుష్యంతో తమ ఆరోగ్యాలు దెబ్బ తింటాయని సమీపంలోని ఆనూరు, కొండపల్లి, రామేశ్వరంపేట, సూరంపాలెం, వాలు తిమ్మాపురం తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పవర్‌ ప్లాంట్‌లో చెత్తను మండిస్తే వచ్చే హానికర రసాయనాలు ఇక్కడి గాలిని కలుషితం చేస్తాయని చెబుతున్నారు. దీనివలన ప్రజారోగ్యంపై దుష్ప్రభావం పడటమే కాకుండా సమీపంలోని పచ్చని పంటలు, పండ్ల తోటలు మాడి మసైపోతాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌తో పోలిస్తే చెత్త దహన యంత్రాలు పాదరసం, సీసం, నైట్రోజన్‌ ఆకై ్సడ్‌లను అధిక స్థాయిలో విడుదల చేస్తాయని నిపుణులు చెబుతున్నా పరిగణనలోకి తీసుకోవడం లేదని ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న వామపక్ష ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివలన పరిసర గ్రామాల ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, నరాల రుగ్మతలు, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక రోగాల బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాంట్‌ నుంచి వచ్చే కాలుష్యంతో గాలి, నీరు, నేల కలుషితమై పర్యావరణం దెబ్బ తింటుందని ఆరోపిస్తున్నారు.

ప్రమాదకర స్థాయిలో బాటమ్‌ యాష్‌!

ఢిల్లీ సమీపాన ఓఖ్లాలో చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా గతంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. పర్యావరణంపై దుష్ప్రభావం చూపిందని పేర్కొంటూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ 2016లో ఓఖ్లా ప్లాంట్‌కు రూ.25 లక్షల జరిమానా కూడా విధించిందని చెబుతున్నారు. వాస్తవానికి బాటమ్‌ యాష్‌ 20 శాతం కంటే ఎక్కువ ఉండకూడదని, కానీ చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌లో అది 40 శాతం వరకూ ఉంటుందని, ఇది ఆందోళన కలిగిస్తోందని ఉద్యమకారులు అంటున్నారు. బాటమ్‌ యాష్‌ వ్యర్థాలను శుద్ధి చేయడం, నిల్వ చేయడం పెద్ద సమస్యగా మారుతుందనే ఆందోళన నెలకొంది. ఇటువంటి అంశాల్లో ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రభుత్వం.. ఈ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై కేసులు పెడుతూ ఉక్కుపాదం మోపుతూండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

రామేశ్వరం మెట్ట వద్ద జగనన్న లే అవుట్‌

గత సీఎం జగన్‌ హయాంలో

250 మందికి స్థలాలు

ఇళ్ల నిర్మాణానికి వీలుగా

చదును చేసి మరీ అప్పగింత

ఆ లే అవుట్‌ను

గాలికొదిలేసిన బాబు సర్కార్‌

ఆ భూములపై అధికార పార్టీ నేతల కన్ను

విద్యుత్‌ ప్లాంట్‌కు అప్పగించేందుకు ప్రతిపాదనలు

భగ్గుమంటున్న నిరుపేదలు

వెంటనే రద్దు చేయాలి

ఆనూరులో జిందాల్‌ పవర్‌ప్లాంట్‌ ఆధ్వర్యాన ప్రతిపాదించిన చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని రద్దు చేయాలి. దీనిని ఏర్పాటు చేస్తే చుట్టూ ఉన్న పచ్చటి పంటలు, మామిడి, జీడిమామిడి, ఆయిల్‌పామ్‌, నిమ్మ వంటి తోటలు మాడిపోతాయి. చెత్తను మండించడం వలన దుర్వాసన రావడంతో పాటు, హానికర రసాయనాలు గాలిని కలుషితం చేస్తాయి. చుట్టుపక్కల ప్రజలు వివిధ రోగాల పాలయ్యే ప్రమాదముంటుంది. అందువలన ఈ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి. లేకుంటే ప్రజలను సమీకరించి ఉద్యమిస్తాం.

– కర్నాకుల వీరాంజనేయులు, రాష్ట్ర ప్రధాన

కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం

పేదలకు అన్యాయం

ఆనూరులో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించిన భూములను నేటి చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తీసుకుని జిందాల్‌ కంపెనీకి కట్టబెట్టడం అన్యాయం. దీంతో మహిళల సొంతింటి కల నెరవేరడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్‌ రుణాలిచ్చి ఆదుకుంటుందని అనుకుంటే.. అసలు ఇంటి స్థలమే లేకుండా చేస్తోంది. అలాగే, వాలుతిమ్మాపురానికి చెందిన దళితుల భూముల్ని కూడా ప్రభుత్వం స్వల్ప ధరకు తీసుకుని కంపెనీకి ఇచ్చేస్తోంది. కాలుష్యాన్ని వెదజల్లే జిందాల్‌ పరిశ్రమను వెంటనే రద్దు చేసి, ఆ భూములను తిరిగి లబ్ధిదారులకు పంపిణీ చేయాలి.

– రెడ్డి దుర్గాదేవి, జిల్లా నాయకురాలు,

ప్రగతిశీల మహిళా సంఘం (సీ్త్ర విముక్తి),

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ

సర్కారు వారి జిందాల్‌బాద్‌!1
1/3

సర్కారు వారి జిందాల్‌బాద్‌!

సర్కారు వారి జిందాల్‌బాద్‌!2
2/3

సర్కారు వారి జిందాల్‌బాద్‌!

సర్కారు వారి జిందాల్‌బాద్‌!3
3/3

సర్కారు వారి జిందాల్‌బాద్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement