కోటి తులసి పూజకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

కోటి తులసి పూజకు శ్రీకారం

Feb 7 2026 9:41 AM | Updated on Feb 7 2026 9:41 AM

కోటి

కోటి తులసి పూజకు శ్రీకారం

సత్యదేవుని సన్నిధిలో

ఘనంగా ప్రారంభం

10 రోజుల పాటు నిర్వహణ

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో పది రోజుల పాటు జరిగే కోటి తులసి పత్రి పూజ ఘనంగా ప్రారంభమైంది. రత్నగిరి రామాలయం వద్ద సత్యదేవుని వార్షిక కల్యాణ మండపంలో శుక్రవారం ఉదయం 7.30 గంటలకు దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వి.త్రినాథరావు దంపతులు పండితుల మంత్రోచ్చారణల నడుమ ఈ పూజకు శ్రీకారం చుట్టారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు తులసి దళాలు సమర్పించారు. కోటి తులసి పూజలో పాల్గొంటున్న వేద పండితులు, అర్చకులు, వ్రత పురోహితులు, ఆగమ పాఠశాల విద్యార్థులకు చైర్మన్‌, ఈఓలతో పాటు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం.మంజులాదేవి దీక్షా వస్త్రాలు అందించారు.

15వ తేదీ వరకూ..

కోటి తులసి పూజలో భాగంగా మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, నవావరణార్చన, రామాయ ణ, భారత, భాగవత పారాయణ తదితర కార్యక్రమా లు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాల అనంతరం, రుత్విక్కులు విష్ణు సహస్ర నామాలు పఠిస్తూ స్వామి, అమ్మవార్లను తులసి దళాలతో అర్చించారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగింది. అనంతరం, స్వామి, అమ్మవార్లకు నివేదనలు చేసి, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి, భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ తులసి పూజ నిర్వహించారు. రోజుకు 10 లక్షల చొప్పున ఈ నెల 15వ తేదీ నాటికి కోటి తులసి పూజ పూర్తి చేస్తారు. చివరి రోజు ఉదయం 8 గంటలకు రుద్రహోమం నిర్వహించడంతో ఈ మహా క్రతువు ముగియనుందని ఈఓ త్రినాథరావు తెలిపారు.

ప్రతిధ్వనించిన వేదనాదం

కోటి తులసి పూజ సందర్భంగా రత్నగిరిపై వేదనాదం ప్రతిధ్వనించింది. దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, సూర్యనారాయణ, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు సుధీర్‌, దత్తాత్రేయశర్మ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, కొంపెల్ల మూర్తి, పరిచారకులు శివ, పవన్‌, మరో 60 మంది పండితుల సుస్వర వేద మంత్రోచ్చారణలతో ఈ క్రతువు నిర్వహించారు. ఈ పూజను పురస్కరించుకుని సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం, విశ్రాంతి మండపాలను పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహాయజ్ఞంతో సమానమైన ఈ క్రతువును అందరూ తిలకించి సత్యదేవుని కృపకు పాత్రులు కావాలని పండితులు కోరారు. కోటి తులసి పూజకు రూ.5 లక్షల విరాళం సమర్పించిన అరబిందో ఫార్మా కంపెనీ తరఫున డైరెక్టర్‌ లక్ష్మి, దేవస్థానానికి వివిధ రూపాల్లో సుమారు రూ.20 లక్షల విరాళం ఇచ్చిన పీఎస్‌ కుమార గురుపరన్‌, శాంతి దంపతులు (చైన్నె), పలువురు దాతలు స్వామివారికి తులసి దళాలు సమర్పించారు. ఏర్పాట్లను ఏఈఓలు కృష్ణారావు, అనకాపల్లి ప్రసాద్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ గణపతి తదితరులు పర్యవేక్షించారు. సుమారు 50 మంది స్వచ్ఛంద సేవా కార్యకర్తలు తులసి దళాలను సిద్ధం చేసే సేవలో పాల్గొన్నారు. సత్యదేవుని దీక్ష ప్రచార కర్త నల్లమిల్లి కృష్ణబాబు కూడా సేవలో పాల్గొన్నారు.

● కోటి తులసి పూజ సందర్భంగా స్వామివారి వార్షిక కల్యాణ వేదికపై అలంకరణ బాగుంది. అయితే, కల్యాణ వేదిక నుంచి విశ్రాంతి మండపం వరకూ షామియానా వేయడంతో ఆ అలంకరణతో పాటు కల్యాణ వేదిక గోపురం కూడా కనిపించడం లేదు. దీనిపై అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిని గుర్తించిన ఈఓ త్రినాథరావు ఆ షామియానాను తొలగించాలని ఆదేశించారు.

● 2022లో కోటి తులసి పూజ జరిగినప్పుడు మండపం ప్రారంభంలో తులసి మొక్కల కుండీల నడుమ సత్యదేవుని ఉత్సవమూర్తులను ఏర్పాటు చేశారు. భక్తులు అక్కడ ఫొటోలు దిగేవారు. ఇప్పుడు అటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

● 2022తో పోల్చితే అలంకరణ కూడా తక్కువగా ఉంది. మిగిలిన రోజుల్లోనయినా అలంకరణ బాగా చేయాలని భక్తులు కోరుతున్నారు.

● కోటి తులసి పత్రి పూజకు సప్తగిరి హేచరీస్‌ ఎండీ పెదబాబు శుక్రవారం రూ.1.08 లక్షల విరాళం అందజేశారు.

కోటి తులసి పూజకు శ్రీకారం1
1/1

కోటి తులసి పూజకు శ్రీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement