త్వరలో వనదుర్గమ్మ ఆలయ మండపం విస్తరణ
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారి ఆలయ మండపాన్ని మరింత విస్తరించనున్నారు. ఆలయంలో ఈ నెల 20న ఖడ్గమాల కుంకుమ పూజ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. దీనికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. అయితే, అందుకు తగినట్టుగా ఆలయ మండపం విశాలంగా లేదు. ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి చండీహోమం, ప్రతి పౌర్ణమి, అమావాస్య తిథుల్లో ప్రత్యంగిర హోమం నిర్వహిస్తున్నారు. వీటిల్లో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. కొన్నిసార్లు వందకు పైగా టికెట్లు కొనుగోలు చేసి భక్తులు ఈ హోమాల్లో పాల్గొంటున్నారు. అయి తే, అందుకు తగినట్టుగా ఈ మండపం చాలకపోవడంతో పలువురు భక్తులు వెలుపలే ఉండాల్సి వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ మండపాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దేవస్థానం అధికారుల విజ్ఞప్తి మేరకు దేవదాయ శాఖ డిప్యూటీ స్థపతి శ్రీనివాసాచారి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావులతో కలసి వనదుర్గ అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం పరిశీలించారు. ఆలయ మండపాన్ని తూర్పు వైపు 30 అడుగుల ముందుకు పెంచుకోవచ్చని సూచించారు. ఆలయం ముందున్న మెట్లు తొలగించి, ఆలయం ముందు ఒక స్లాబ్, దిగువన హోమ మండపం మీద మరో స్లాబ్ వేసి విస్తరించనున్నట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు. ఆలయ మండప విస్తరణ ప్లాన్‌ను డిప్యూటీ స్థపతి మూడు నాలుగు రోజుల్లో దేవస్థానానికి అందించనున్నా రు. ఆ వెంటనే అంచనాలు రూపొందించి, టెండర్ పిలిచి, నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు.
వనదుర్గ అమ్మవారి ఆలయం
త్వరలో వనదుర్గమ్మ ఆలయ మండపం విస్తరణ


