లడ్డూ ప్రసాదంపై రచ్చ వద్దు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో హిందూ ధార్మిక విశ్వాసాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఆర్.రవిశంకర్ పట్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్రంలో రాజకీయ అంశంగా మారుతోందని, దీనివల్ల ధార్మికతకు, భక్తుల విశ్వాసాలకు భంగం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఈ అంశంపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల విషయంలో ఆయా పార్టీలు సంయమనం పాటించాలని కోరారు. భక్తుల విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతినేలా ఎవ్వరూ ప్రకటనలు చేయరాదన్నారు. రాష్ట్రంలో ఆవుల అక్రమ రవాణా, గోవధను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నగదు రహిత వైద్యం
అందించకపోతే చర్యలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. ఈ పథకం ద్వారా రోగులకు నగదు రహిత వైద్యం అందించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ఎన్‌టీఆర్ వైద్య సేవ డిస్ట్రిక్ డిసిప్లినరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద అందించిన వైద్య సేవలకు గాను రోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఏడు ఆస్పత్రులకు పెనాల్టీ విధించారు. ఈ పథకం కింద ఏ నెట్‌వర్క్ ఆస్పత్రిలోనైనా చికిత్సను నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అటువంటి ఫిర్యాదులు వస్తే నమోదు చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జె.నరసింహ నాయక్, ఎన్‌టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా చండీహోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి పండితులు ప్రత్యేక పూజలు చేసి, చండీహోమం ప్రారంభించారు. పూర్ణాహుతి అనంతరం అమ్మవార్లకు వేదాశీస్సులు, నివేదనలు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. వేద పండితులు అమరేశ్వర ఘనపాఠి, వనదుర్గ ఆలయ అర్చకుడు ప్రయాగ రాంబాబు, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్, పరిచారకులు హోమం నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్‌తో పాటు 30 మంది భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, రత్నగిరి తొలి పావంచా వద్ద కనకదుర్గ అమ్మవారికి పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు.
లడ్డూ ప్రసాదంపై రచ్చ వద్దు


