నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కాకినాడకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. కాకినాడ రమణయ్యపేటకు చెందిన గారికపర్తి నమశ్శివాయ కోట సూర్య నరసింహ, నాగమణి అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,152 విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
శాప్ అకాడమీల
ఏర్పాటుకు చర్యలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ, తిరుపతి, విశాఖలో ఆయా క్రీడల ప్రాధాన్యాన్ని బట్టి అకాడమీలు ఏర్పాటు చేస్తామని, కాకినాడను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) చైర్మన్ ఏ.రవినాయుడు ప్రకటించారు. బుధవారం కాకినాడ వచ్చిన ఆయన డీఎస్‌ఏలో విలేకరులతో మాట్లాడారు. జగన్నాథపురంలో రూ.9.84 కోట్లతో 16 ఎకరాల్లో క్రీడా వికాస కేంద్రం ఏర్పాటుకు ఆమోదం ఇచ్చామని తెలిపారు. రూ.1.81 కోట్లతో లింగంపర్తి, రూ.1.07 కోట్లతో పెద్దాపురం, రూ.76.80 లక్షలతో జగ్గంేపేటలో కేవీకేల నిర్మాణాలకు ఉత్తర్వులు జారీచేశామన్నారు. శాప్ నుంచి కాకినాడ డీఎస్‌ఏకు ఈ సంవత్సరం ఏ మాత్రం నిధులు అందించారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. అనంతరం ఇండోర్ హాల్‌లో వివిధ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించి క్రీడా సమస్యలను తెలుసుకున్నారు.
డీఆర్వోగా తిప్పేనాయక్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా డి.తిప్పేనాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ డీఆర్వోగా పనిచేస్తున్న జె వెంకట్రావు సింహాచలం దేవస్థానం ఈఓగా బదిలీ అయ్యారు. తిప్పే నాయక్ ప్రస్తుతం అనంతపురం జిల్లా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన రెండు, మూడు రోజుల్లో విధుల్లో చేరనున్నట్లు తెల్సింది.
నేడు సత్యదేవుని
హుండీల లెక్కింపు
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించనున్నారు. దేవస్థానంలో హండీ ఆదాయాన్ని చివరిసారిగా డిసెంబర్ 31న లెక్కించారు. దీంతో 35 రోజులలో భక్తులు సత్యదేవుని హుండీలలో సమర్పించిన కానుకలను గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కించనున్నారు. దేవస్థానం సిబ్బంది అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఈఓ త్రినాథరావు ఆదేశించారు.
తిరుమల ప్రతిష్టను పాడు చేసింది బాబు సర్కారే
వైఎస్సార్ సీపీ రైతు విభాగం
రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి
అల్లవరం: చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి నేతలు తిరుమల వేంకటేశ్వరుని ప్రతిష్టను దిగజారుస్తూనే ఉన్నారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు బుధవారం అన్నారు. మండలం డి.రావులపాలెంలోని ఆయన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష సాధించేందుకు చంద్రబాబు ప్రభుత్వం స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని అబద్ధాన్ని ప్రచారం చేసి తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించారన్నారు. లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ నిర్థారించినా చంద్రబాబు, కూటమి నేతలు హిందువుల మనోభావాలతో ఆటలాడుతున్నారని, వారిలో కొంచైమెనా పాశ్చాత్తాపం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలను, తప్పులను కప్పి పుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలపై దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేసిన వారిని వదిలేసి బాధితుడైన రాంబాబుపై కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు.


