ఆదమరిస్తే అపాయమే..
ఐఎంఏ ఆధ్వర్యంలో
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
కాకినాడ క్రైం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం బుధవారం జరిగింది. స్థానిక డీఎస్‌ఐ గ్రౌండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బి.ఎస్.రావు మెమోరియల్ ఐఎంఏ హాలులో నిర్వహించారు. ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్‌గా ప్రముఖ ప్రకృతి వైద్యనిపుణురాలు డాక్టర్ ఎ.ఎల్.సత్యవతి వ్యవహరించగా, ముఖ్య అతిథిగా కాకినాడ మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.ఆనంది హాజరయ్యారు. ఆమె ఉదయం 9.45 గంటలకు ఉచిత కేన్సర్ మెగా స్క్రీనింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్‌ను ఆరంభ దశలో గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునన్నారు. ఇటువంటి స్క్రీనింగ్ శిబిరాలు సమాజానికి ఎంతో ఉపయోగమన్నారు. డాక్టర్ ఎ.ఎల్.సత్యవతి మాట్లాడుతూ క్యాన్సర్ కేసులు నానాటికి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తీసుకుంటున్న ఆహారం, పెరుగుతున్న ఒత్తిడి, మారిన జీవనశైలి క్యాన్సర్ వ్యాప్తికి కారణమన్నారు. మహిళలు ముఖ్యంగా స్క్రీనింగ్ పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవడం ద్వారా ముందస్తుగా గుర్తించి ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునన్నారు. ఆదమరిస్తే అపాయమేనని తెలిపారు. సామాన్య ప్రజల నుంచి వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపితే కాకినాడను క్యాన్సర్ రహిత జిల్లాగా మార్చడం సాధ్యమేనని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా డీఎంహెచ్‌వో డాక్టర్ ఎ.నరసింహనాయక్ హాజరయ్యారు. ఐఎంఏ కాకినాడ అధ్యక్షుడు డాక్టర్ కాదా వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎస్.సి.హెచ్.ఎస్.రామకృష్ణ కార్యక్రమం నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. ఐఎంఏ నాయకులు డాక్టర్ జీఎస్ మూర్తి, డాక్టర్ బీవీ మహేష్, డాక్టర్ మోకా పవన్‌కుమార్ హాజరయ్యారు.


