అధినేతతో భేటీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితిని వివరించారు. పార్టీ నియామకాలపై చర్చించారు.
నేడు జెడ్పీ బడ్జెట్ సమావేశం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ బడ్జెట్ సమావేశం కాకినాడలోని జెడ్పీ కార్యాలయంలో బుధవారం జరుగుతుందని సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు తెలిపారు. జెడ్పీ కార్యాలయంలోని తన చాంబర్‌లో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. దీనిలో బడ్జెట్‌తో పాటు 13 శాఖలపై సభ్యులు సమీక్షిస్తారని తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సొంత వనరుల ద్వారా రూ.24 కోట్లతో అంచనా బడ్జెట్ రూపొందించామన్నారు. ప్రభుత్వ నిర్దిష్ట గ్రాంట్ల నుంచి రూ.24.31 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. వ్యయాలు అదే స్థాయిలో ఉంటాయని వివరించారు. ఇతర గ్రాంట్ల ద్వారా మరో రూ.27 కోట్లు వచ్చే అవకాశముందన్నారు. ఈ సమావేశానికి సంబంధించి ప్రజాప్రతినిధులకు, వివిధ శాఖల అధికారులకు, జెడ్పీటీసీ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించామని లక్ష్మణరావు చెప్పారు.
ఉపాధి చట్టంలో
మార్పులు దారుణం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, జీరాంజీ పథకాన్ని తీసుకురావడాన్ని నిరసిస్తూ ‘ఇంటింటికీ ఉపాధి’ పేరిట ప్రచారోద్యమం నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు తెలిపారు. ఈ కార్యక్రమం వాల్‌పోస్టర్‌ను స్థానిక సుందరయ్య భవన్‌లో మంగళవారం ఆయన విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా ఈ నెల 14న భోగి మంటల్లో జీరాంజీ చట్టం కాపీలను దహనం చేశామని తెలిపారు. పనిదినాల పెంపు పేరుతో గతంలో ఉన్న చట్టాన్ని మార్చినట్లు చెబుతున్నారని, దీనికి చట్టాన్ని మార్చాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. తాము 200 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని, వాస్తవానికి ఇప్పుడు 50 పనిదినాలు కూడా ఉండటం లేదని అన్నారు. కనీస వేతనం రూ.304 ఇవ్వాలని ఉన్నా ప్రస్తుతం కనీసం రూ.220 కూడా రావడం లేదని చెప్పారు. ఇటువంటి లోపాలను మెరుగు పరచాల్సింది పోయి ఏకంగా చట్టాన్నే రద్దు చేశారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ చేపడుతున్న ప్రచారోద్యమంలో భాగంగా ప్రతి ఇంటికీ కరపత్రాలు పంచుతామన్నారు. వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, చేతివృత్తిదారులు వాస్తవాలను గుర్తించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రసాదరావు కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కేఎస్ శ్రీనివాస్, ఎం.రాజశేఖర్, టేకుమూడి ఈశ్వరరావు, సి.రమణి తదితరులు పాల్గొన్నారు.
అధినేతతో భేటీ


