‘నవీన’ యుద్ధంలో ‘సానా’ చిత్తు
అంతా ఒక్కటవడంతో చుక్కెదురు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తెలుగుదేశం పార్టీ జిల్లా పగ్గాలు అనుచరుడికి కట్టబెట్టడంలో పెద్దల సభ (రాజ్యసభ) సభ్యుడు సానా సతీష్‌కు పరాభవం ఎదురైంది. అనుకున్నదొక్కటి, అయినదొక్కటి అంటూ సతీష్ వర్గం పార్టీలో కిమ్మనడం లేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా జెడ్పీ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్ కొనసాగుతున్నారు. నవీన్‌ను అధ్యక్ష స్థానం నుంచి తప్పించేందుకు సతీష్ వర్గీయులు గడచిన మూడు నెలలుగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వస్తున్నారు. ప్రజారాజ్యం సహా పలు పార్టీలు మారి ప్రస్తుతం టీడీపీలో సానాకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న మెట్ట ప్రాంతానికే చెందిన తోట నవీన్‌ను జ్యోతుల నవీన్ స్థానంలో తెరమీదకు తీసుకువచ్చారు. ఇందుకోసం ఐవీఆర్‌ఎస్ సర్వేను సైతం ప్రభావితం చేసే ప్రయత్నాలు తెర వెనుక తీవ్రంగా చేశారనే చర్చ జిల్లా టీడీపీ వర్గాల్లో విస్తృతంగా జరిగింది. ఒకపక్క జ్యోతుల నవీన్‌కుమార్‌కు మద్దతుగా తండ్రి, టీటీడీ సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ, తోట నవీన్‌కు అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టేందుకు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు హోరాహోరీగా తలపడ్డారు. అలాగని ఎక్కడా బయటపడకుండా చాపకింద నీరులా వ్యూహ, ప్రతి వ్యూహాల్లో తలమునకలయ్యారు. ఇద్దరు నవీన్‌లలో అధ్యక్ష పగ్గాలు ఎవరికి దక్కుతాయో అన్న ఉత్కంఠ టీడీపీలో కొంత కాలంగా ఉంది. ఇరువర్గాలు ఎవరి ప్రయత్నాలలో వారుండగా పార్టీ అఽధిష్టానం మంగళవారం ప్రస్తుత అధ్యక్షుడు నవీన్‌కుమార్‌నే అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. రెండు, మూడు నెలలుగా ఇందుకోసం బాహాబాహీగా తలపడ్డ ఇరువర్గాల్లో జ్యోతులదే పై చేయి అయ్యింది. తోట నవీన్‌కు పగ్గాలు కట్టబెట్టడం ద్వారా జ్యోతులకు చెక్ పెట్టాలనే సానా వ్యూహం చివరకు బెడిసికొట్టింది.
అప్పటి నుంచీ కుమ్ములాటలు
ఇవి వీరి మధ్య ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన వైషమ్యాలు కాదు. సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి కాకినాడ ఎంపీ సీటు విషయమై ఈ రెండు వర్గాల మధ్య ప్రచ్చన్న యుద్ధం సాగింది. తన రాజకీయ వారసుడిగా నవీన్‌ను పార్లమెంటు సభ్యుడిని చేయాలనేది తండ్రి జ్యోతుల కల. అప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ పని చేయడం, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండటంతో ఎంపీ సీటు ఇవ్వడానికి అర్హత ఉందని చెప్పి జ్యోతుల నెహ్రూ నాడు గట్టిగా పట్టుబట్టారు. అప్పట్లో లోకేష్ అండదండలతో కాకినాడ పార్లమెంటు స్థానాన్ని సతీష్ ఆశించారు. అయినా ఆ సమయానికి సానా టీడీపీలో చేరలేదు. కానీ సేవా కార్యక్రమాలతో పాపులారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. తండ్రి నెహ్రూ ఎమ్మెల్యేగా, కొడుకు నవీన్ జెడ్పీ చైర్మన్‌గా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, అప్పటికే పదవులు పొందారని, అదే కుటుంబం నుంచి మరొకరికి ఎంపీ సీటు కోసం ఎలా ప్రతిపాదిస్తారని సానా సతీష్ వర్గం అధిష్టానం వద్ద అడ్డుపుల్ల వేసిందనే ప్రచారం అప్పట్లో జరిగింది. రెండు వర్గాల మధ్య కాకినాడ ఎంపీ సీటు సిగపట్ల నేపథ్యంలో ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. అనంతరం జరిగిన పరిణామాల్లో సానా సతీష్ అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడైన విషయం విదితమే.
జ్యోతుల నవీన్‌కుమార్
తోట నవీన్
టీడీపీ జిల్లా పగ్గాల కోసం సిగపట్లు
‘తోట’కు ఎంపీ సతీష్ మద్దతు
జ్యోతులకు
ముకుతాడు వేసే ప్రయత్నాలు
ఐవీఆర్‌ఎస్ సర్వే పేరుతో కుతంత్రం
అయినా ఆధిపత్యం నెహ్రూదే
నాటి వైషమ్యాలే తాజాగా పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాల కోసం ఇరు వర్గాలు సిగపట్లకు కారణమైందనే చర్చ పార్టీ నేతల మధ్య జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోను జ్యోతుల నవీన్‌కు పార్టీ పగ్గాలు తిరిగి దక్కకుండా చేయాలనే వ్యూహంతో సతీష్ వర్గం సానా చేసిందంటారు. సర్వశక్తులూ ఒడ్డి చివరకు చినబాబు సహకారం కూడా తీసుకుందంటున్నారు. ఇందుకు పార్టీ నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేను కూడా తమకు అనుకూలంగా మలుచుకునే వ్యూహాలకు పదును పెట్టారంటున్నారు. ఐవీఆర్‌ఎస్ సర్వేలో తన మద్దతుదారుడైన తోట నవీన్‌కు అనుకూలంగా పెద్ద ఎత్తున కాల్స్ చేయించారనే ప్రచారం కూడా పార్టీ నేతల ప్రైవేటు సంభాషణల్లో వినిపించింది. పార్టీలో సీనియర్ అయిన నెహ్రూ వ్యూహం ముందు సానా సతీష్ వర్గం తేలిపోయిందంటున్నారు. పార్టీలో ఒకప్పుడు చంద్రబాబు తరువాత చంద్రబాబుగా చెప్పుకునే యనమల రామకృష్ణుడుకు జ్యోతుల నెహ్రూ మధ్య దశాబ్దాల కాలం రాజకీయ వైరం కొనసాగింది. అటువంటి యనమల సహా పలువురు జిల్లా నేతలు తాజా రాజకీయ పరిణామాల్లో జ్యోతుల తనయుడు నవీన్‌కు మద్దతుగా నిలిచారంటున్నారు. ఆవిర్భావం నుంచి ఉన్న పార్టీ నేతలు అంతా ఒక వైపు నిలవడంతో జ్యోతుల నవీన్‌కు పగ్గాలు దక్కి సానా వర్గానికి చుక్కెదురైంది.
‘నవీన’ యుద్ధంలో ‘సానా’ చిత్తు


