సమన్వయంతో పోలియో అంతం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా ఈనెల 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలియోను అంతమొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆదివారం పోలియో బూతులతో పాటు, సోమ, మంగళవారాలు రెండు రోజుల పాటు ప్రతీ ఇంటిని సందర్శించాలని అధికారులకు స్పష్టం చేశారు. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 5 సంవత్సరాలలోపు ఉన్న సుమారు 1.94 లక్షల చిన్నారుల కోసం 1,332 పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. 61 మొబైల్ టీమ్స్‌ను అందుబాటులో ఉంచామని, 130 రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమం జిల్లాలో సజావుగా జరిగేందుకు వైద్య ఆరోగ్యశాఖ నుంచి 1,302 పారామెడికల్ సిబ్బందిని, 1,442 మంది ఆశా వర్కర్లను, 1,968 మంది అంగన్‌వాడీ సిబ్బందిని, 656 మంది ఉపాధ్యాయులు నర్సింగ్ స్టూడెంట్స్, ఇతర వలంటీర్లను అందుబాటులో ఉంచామన్నారు. పట్టణ ప్రాంతాల్లోని స్లమ్ ఏరియాలు, నూతనంగా ఏర్పడిన హౌసింగ్ కాలనీలు, మత్స్యకార ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో రెండు చుక్కలు వేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాల విద్యార్థులతో గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించాలన్నారు. అనంతరం పల్స్ పోలియో కార్యక్రమంపై రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లావైద్యారోగ్యశాఖాధికారి జె.నరసింహనాయక్ పల్స్ పోలియో కార్యక్రమం సజావుగా జరిగేందుకు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చేపడుతున్న కార్యకలాపాలను అధికారులకు వివరించారు.


