ఆ అమ్మాయి.. అవధానంలో దిట్టోయి
తాళ్లరేవు: అవధానం అనేది తెలుగు సాహిత్య ప్రక్రియలో మేథో ప్రతిభను పరీక్షించే ఒక క్లిష్టమైన కళ.. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అతి చిన్న వయసులోనే చందాన జయలక్ష్మి అవధాన రంగంలో ఔరా అనిపిస్తుంది. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తోంది. అవధానం చేపట్టిన తొలి అడుగుల్లోనే తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంస్కృతం అనగానే క్లిష్టమైనదని భావించి నేర్చుకోవడానికి కూడా భయపడే నేటి రోజుల్లో, ఆంధ్రాలో పుట్టి కర్ణాటకలో స్థిరపడిన 13 ఏళ్ల బాలిక అవలీలగా సంస్కృతాన్ని ఉచ్చరించడంతో పాటు అత్యంత క్లిష్టమైన అష్టావధానాన్ని చేస్తూ ఘనాపాఠీలను సైతం ఔరా అనిపిస్తోంది. అంతటితో ఆగకుండా సంస్కృతంతోపాటు తెలుగు, కన్నడ, ఇంగ్లిష్, హిందీ భాషలను అవలీలగా మాట్లాడుతూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆ చిన్నారి చెప్పే మాటలు వినడానికి వేద పండితులు సైతం ఆసక్తి చూపడం గమనార్హం.
ఇంజరంలో పుట్టి.. బెంగళూరులో పెరిగి..
తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామానికి చెందిన నరసింహదేవర మైథిలీనాథ్ వృత్తి రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయన ప్రముఖ హెచ్‌ఏఎల్ కంపెనీలో సీనియర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన సతీమణి కిరణ్మయి గృహిణి. వీరి గారాల పట్టి నరసింహదేవర జయలక్ష్మికి చిన్నతనం నుంచి చదువులో ముందుండేది. కుటుంబ నేపథ్యం, బాల్య దశ నుంచే సంస్కృతం సాహిత్యాభిలాషతో, శాసీ్త్రయ శిక్షణతో అవధానంలో అడుగుపెట్టింది. తాత సుబ్బారావు సూచనతో బెంగళూరు పూర్ణ ప్రమతి గురుకుల పాఠశాలలో జయలక్ష్మిని చేర్చించి సంస్కృతం నేర్పించారు.
కాశీలో తొలిసారి..
ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ మహానగరంలో జయలక్ష్మి ఈ ఏడాది అక్టోబర్ 26న సంస్కృతంలో తొలి అష్టావధానం చేసింది. అలాగే మధునాపంతుల సత్యనారాయణమూర్తి సూచనలతో కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో రెండో అష్టావధానం చేసి అందరినీ ఆకట్టుకుంది. చిన్న వయసులో రాణిస్తున్న జయలక్ష్మిని ఘనంగా సత్కరించారు.
ఫ సంస్కృతంలో అష్టావధానం
చేస్తున్న బాలిక
ఫ జయలక్ష్మికి ప్రశంసల వెల్లువ
సంప్రదాయాలను కాపాడాలనే..
మన సనాతన ధర్మం, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలనే లక్ష్యంతో జయలక్ష్మికి దేవభాష సంస్కృతం నేర్పించాం. ఏదీ కష్టతరం కాదని, నేర్చుకుంటే అన్నీ సులభతరమేనని రుజువు చేస్తూ ప్రతిభ కనబరుస్తుంది. నేటి బాల, బాలికలలో స్ఫూర్తి నింపే విధంగా తమ కుమార్తెను తీర్చిదిద్దుతాం.
– నరసింహదేవర మైథిలీనాఽథ్, జయలక్ష్మి తండ్రి
విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు..
జయలక్ష్మిలో ఉన్న విశేష ప్రతిభను గుర్తించి తమ పాఠశాలకు తీసుకువచ్చి సత్కరించాం. తమ విద్యార్థులకు సంస్కృత భాషపై అవగాహన కల్పించడంతో పాటు స్ఫూర్తి నింపే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఐదు భాషల్లో అవలీలగా మాట్లాడుతున్న జయలక్ష్మిని చూసి విద్యార్థినీ, విద్యార్థులు ఎంతో స్ఫూర్తి పొందారు.
–టీవీఎస్‌ఎస్‌వీ ప్రసాదరావు, హెచ్‌ఎం, రీజెన్సీ హైస్కూల్
ఆ అమ్మాయి.. అవధానంలో దిట్టోయి
ఆ అమ్మాయి.. అవధానంలో దిట్టోయి
ఆ అమ్మాయి.. అవధానంలో దిట్టోయి


