ఉపాధి హామీ రద్దుకే కొత్త బిల్లు
● 22న కలెక్టరేట్ వద్ద నిరసన
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తాటిపాక మధు
కాకినాడ రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకే కేంద్రం కొత్త బిల్లులను తీసుకువచ్చిందని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో మండలంలోని నేమాం, తిమ్మాపురం, పండూరు గ్రామాలలో ఉపాధి పనుల వద్దకు బుధవారం వెళ్లి కూలీలతో మాట్లాడారు. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 22న కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి తరలిరావాలని కూలీలను కోరారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కొత్త బిల్లు చట్టమైతే ఉపాధి హామీ చట్టం తల లేని మొండెంగా తయారవుతుందన్నారు. హామీ అనే పదం తొలగించడం ద్వారా ఉపాధి చట్టం నిర్వీర్యమవుతుందన్నారు. పనిదినాలు 125 రోజులకు పెంచుతున్నామని చెప్పి 60 రోజుల పని నిషేధం విధించారని విమర్శించారు. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రాలు 40శాతం వాటా భరించాలని పేర్కొనడం దారుణమని, పనులను నాలుగు రకాలుగా విభజించి యంత్రాలు, కాంట్రాక్టర్లకు ఉపాధి హామీగా మార్చుతున్నారని విమర్శించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కూలీలు 22న రాష్ట్ర వ్యాప్త నిరసనల్లో పాల్గొని బిల్లు కాగితాలను దగ్ధం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ పేరు వింటుంటే మోదీకి నిద్ర పట్టడం లేదన్నారు. కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా కన్వీనరు నక్కు శ్రీనివాసరావు, బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు అప్పలరాజు, కార్యదర్శి పప్పు ఆదినారాయణ, సరస్వతి మోహన్, వీరబాబు, కావలమ్మ, చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు.


