పరమాత్మ తప్ప రక్షకులు లేరు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘కృష్ణా! మహావీరులు అయిన అయిదుగురు పతులు నిస్సహాయులుగా మిగిలిపోయినప్పుడు నీవే నిండుసభలో నన్ను రక్షించావు’ అని ద్రౌపది వనవాసం చేస్తున్న తమను చూడటానికి వచ్చిన కృష్ణ పరమాత్మతో అంటుందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. హిందూ సమాజంలో ఆయన వ్యాసభారతం, వనపర్వంలోని పలు అంశాలను వివరించారు. పరమాత్మ తప్ప రక్షకులు లేరని నాటి సభలో నిరూపణ అయిందని ఆమె అంటుంది. కృష్ణ పరమాత్మ ద్రౌపదిని పరాభవిస్తున్న సమయంలో తాను ద్వారకలో లేనని, ఉంటే ఇలా జరిగేది కాదని అంటాడు. ఇక్కడ మనకు సందేహం రావచ్చు, ద్రౌపదికి అక్షయ వస్త్రాలు ఇచ్చి, ఆమెను కాపాడిన కృష్ణుడు తాను ద్వారకలో లేకపోవడం వలన ఈ అనర్థం జరిగిందని చెప్పడంలో అంతరార్థం మనం తెలుసుకోవాలని అన్నారు. నీలకంఠీయ వ్యాఖ్యానాన్ని అనుసరించి, ద్వారక అంటే నవద్వారాలు కల శరీరమని ఆయన వివరించారు. ద్రౌపదిని దుశ్శాసనాదులు అవమానిస్తుంటే, పాండవుల స్మరణలో కృష్ణుడు లేడు, వారు విధి బలీయమైందని అనుకున్నారే కానీ, కృష్ణ స్మరణ చేయలేదు. బుద్ధి ప్రపంచం వైపు తిరిగితే పరమాత్మ కనిపించడు, ఆయన వైపు తిరిగితే కనిపిస్తాడని సామవేదం అన్నారు. పాండవులు వనాలకు తరలిపోయాక, ధృతరాష్ట్రుడు కలత చెంది విదురుని పిలిచి, తనకు హితం ఏది కలిగిస్తుందో చెప్పమంటాడు. పాండవుల రాజ్యభాగం వారికి ఇచ్చి వేయాలి, దుశ్శాసనుడు తాను చేసిన అకృత్యానికి నిండు సభలో పాండవులను క్షమించమని అడగాలి. నీవు దుర్యోధనుని వదిలివేస్తే, అందరూ క్షేమంగా ఉంటారని విదురుడు చెబుతాడు. దానికి తీవ్ర కోపంతో ధృతరాష్ట్రుడు విదురుని నిందించి, నీవు ఉంటే ఉండు, పోతే పొమ్మని అంటాడు. విదురుడు కామ్యకవనంలో ఉన్న పాండవుల వద్దకు వెడతాడు. ధృతరాష్ట్రుడు పశ్చాత్తాపంతో సంజయుని పంపి, విదురుని చేర తీసుకుంటాడని సామవేదం అన్నారు. దుష్టచతుష్టయం కుటిల పన్నాగాలు తెలుసుకున్న వ్యాసుడు వచ్చి ధృతరాష్ట్రునితో పాండవుల రాజ్యం వారికి ఇచ్చివేయమని, లేని పక్షంలో దుర్యోధనుని అడవులకు పంపి పాండవులతో చెలిమి చేయమని అంటాడు. సత్పురుషులతో వైరం ప్రమాదకరం, స్వజనులతో వైరం అంతకన్నా ప్రమాదకరమని హెచ్చరిస్తాడు. హితం ఉపదేశించడానికి వచ్చిన మైత్రే య మహర్షి మాటలను లక్ష్యపెట్టక, వినయరాహిత్యంతో దుర్యోధనుడు తన కాలిని ముందుకు చాచి తొడ మీద కొట్టుకుంటాడు. పాండవులతో శాంతియుతంగా జీవించకపోతే, ధర్మయుద్ధంలో భీముడు నీ తొడను పగలగొడతాడని మైత్రేయ మహర్షి దుర్యోధనుని శపిస్తాడని సామవేదం వివరించారు. వంచన చేసి సుఖపడాలనుకున్నవాడు వధ్యుడేనని సామవేదం అన్నారు.


