‘అంబా’ అని అరచినా..
ఏలేశ్వరం: మూగజీవాల అక్రమ తరలింపునకు 16వ నంబర్ జాతీయ రహదారి రాజమార్గంలా మారింది. ఈ హైవేలో నిత్యం వందలాదిగా ఆవులు, గేదెలను అక్రమార్కులు వివిధ ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. పోలీసు అధికారులు అప్పుడప్పుడు దాడులు చేస్తున్నా.. అక్రమ రవాణాదారులకు అడ్డూ అదుపూ ఉండటం లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం మన్యం తదితర జిల్లాలతో పాటు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల నుంచి హైవే మీదుగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్ వంటి నగరాలకు ప్రతి రోజూ వందల సంఖ్యలో పశువులను తరలిస్తున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లా గనిశెట్టిపాలేనికి చెందిన ఓ ముఠా అండతో మూగజీవాల అక్రమ రవాణా సాగుతోంది. ఇదంతా తెలిసినా కొంత మంది ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. లారీలు, వ్యాన్లతో పాటు చూపరుల కళ్లుగప్పేలా కంటైనర్లు, డబుల్ డెక్కర్ వాహనాల్లో యథేచ్ఛగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండానే డబుల్ డెక్కర్ వాహనాలను పశువుల రవాణాకు వినియోగిస్తున్నారు. మార్గం మధ్యలో ఎటువంటి ఆటంకమూ లేకుండా ఉండేందుకు గనిశెట్టిపాలెం ముఠా ఒక్కో వాహనానికి రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకూ మామూళ్లు చెల్లిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి, ఆయా వాహనాల్లో పరిమితికి మించి ఎక్కిస్తూండటంతో కొన్ని పశువులు ఊపిరాడక మార్గం మధ్యలోనే ప్రాణాలు విడుస్తున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కో వాహనంలో 40 నుంచి 50 వరకూ పశువుల చొప్పున నిత్యం 10 నుంచి 30 వరకూ వాహనాల్లో పశువులను తరలిస్తున్నట్లు సమాచారం. వీటి సంఖ్య శని, ఆది, సోమవారాల్లో 40 నుంచి 50 వరకూ ఉంటుందని చెబుతున్నారు. పశువుల అక్రమ రవాణా అర్ధరాత్రి జరుగుతూండగా.. దానికంటే ముందే ముఠా నాయకుడు ప్రత్యేక వాహనంపై ఆయా చెక్ పోస్టుల వద్దకు వెళ్లి కొంతమంది సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు ముడుపులు చెల్లిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి బయలుదేరిన వాహనాల్లో పశువులను హనుమాన్ జంక్షన్ మీదుగా చిలకలూరిపేటకు చేర్చి, అక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలుస్తోంది. మూగజీవాల తరలింపుపై వస్తున్న ఫిర్యాదులపై అడపాదడపా పోలీసులు స్పందించి, వాటిని స్వాధీనం చేసుకుని, గోశాలలకు తరలిస్తున్నారు. అటువంటి సందర్భాల్లో ఆ ముఠాకు చెందిన వారు కొంత మంది గోశాలల వారితో కుమ్మక్కై పశువులను తిరిగి సొంతం చేసుకుని, తరలించుకుపోతున్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
ఎటువంటి అనుమతులూ లేకుండా, పశువులకు కనీసం తిండి కూడా పెట్టకుండా సుదూర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నా పశువులను వధిస్తున్నారు. మూగజీవాలను అక్రమంగా తరలిస్తున్న వారిపై అధికారులు పక్కా చర్యలు తీసుకోవాలి.
– దాడిశెట్టి వీరబాబు,
జైభీమ్‌రావ్ భారత్ పార్టీ ఉపాధ్యక్షుడు
అక్రమ రవాణాపై కేసులు
పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవల అన్నవరంలో పశువుల అక్రమ రవాణాపై 3 కేసులు నమోదు చేశాం.
– బి.సూర్య అప్పారావు, సీఐ, ప్రత్తిపాడు
ఫ మూగ జీవాల అక్రమ రవాణాకు ‘హైవే’
ఫ యథేచ్ఛగా తరలింపు
ఫ అప్పుడప్పుడు అడ్డుకుంటున్నా
ఆగని అక్రమార్కులు
‘అంబా’ అని అరచినా..
‘అంబా’ అని అరచినా..


