సాయుధ దళాల పతాక నిధికి విరాళం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సిబ్బంది రూ.8,00,700 విరాళాలు సేకరించారు. జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో ఉన్న 8 వేల మంది మెప్మా సిబ్బంది ఒక్కొక్కరు రూ.10 చొప్పున ఈ విరాళం సమకూర్చారు. దీనికి సంబంధించిన చెక్కును కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సమక్షంలో మెప్మా పీడీ బి.ప్రియంవదతో కలసి జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం.కృష్ణారావుకు మంగళవారం అందజేశారు. జేసీ భరత్ మాట్లాడుతూ, మాజీ సైనికుల పునరావాసం, సంక్షేమం, అమర సైనిక కుటుంబాల సంక్షేమానికి ఈ నిధులు ఉపయోగిస్తారని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సాయుధ దళాల పతాక నిధికి విరాళాలందించాలని కోరారు.
అర్జీలకు సంతృప్తికర
పరిష్కారాలు చూపాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో అందిన అర్జీలకు నూరు శాతం సంతృప్తికరమైన పరిష్కారాలు ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌పై అన్ని శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో మాట్లాడి, అర్జీల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఏడాది జూన్ 15 నుంచి జిల్లావ్యాప్తంగా 41,694 అర్జీలు స్వీకరించగా ఈ నెల 10 వరకూ 36,463 అర్జీలు పరిష్కరించామని చెప్పారు. అర్జీదారు సమస్యను దృష్టిలో ఉంచుకుని సరైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పరిష్కారంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. రెవెన్యూ, రీ సర్వే, ఇతర భూ తగాదాలకు సంబంధించిన అర్జీలే ఎక్కువగా వస్తున్నాయని, క్షేత్ర స్థాయిలోని రెవెన్యూ, సర్వే, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, గడువులోగా వీటిని పరిష్కరించాలని జేసీ ఆదేశించారు.
టీడీపీ జిల్లా
అధ్యక్షుడిగా నవీన్
జగ్గంపేట: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ కుమార్ మరోసారి నియమితులయ్యారు. ఆ పదవిలో ఆయనను మరోసారి కొనసాగిస్తూ అధిష్టానం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది.
‘సినిమాలు చూసి
సంతోషించండి.. నమ్మకండి’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘పురాణ కథలకు సంబంధించిన సినిమాలు చూసి సంతోషించండి. ఇంకా ఆనందం కలిగితే చప్పట్లు కొట్టండి, కానీ నమ్మకండి’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ వ్యాఖ్యానించారు. స్థానిక హిందూ సమాజంలో చేస్తున్న వ్యాసభారత ప్రవచనంలో ఆయన మంగళవారం సభాపర్వం ముగించి, వనపర్వంలోకి ప్రవేశించారు. తండ్రి ఎముకలతో చేసిన పాచికలను శకుని ఉపయోగించాడంటూ ఓ సినిమాలో ప్రధానంగా చూపారని, ఇటువంటి కథనం భారతంలో కానీ, ఇతర పురాణాలలో కానీ లేదని చెప్పారు. నిజం చెప్పినా ప్రజలు శంకించేంతలా అసత్యాలు ప్రాచుర్యం పొందుతున్న పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ద్యూతానికి పాండవులను మళ్లీ పిలవాలని విదురుడిని ఆదేశించినప్పుడు భీష్మద్రోణ కృపాచార్యులు, గాంధారి తదితర పెద్దలందరూ ధృతరాష్ట్రుడిని వారించడానికి ప్రయత్నిస్తారు. అవినీతి, క్రౌర్యంతో సంపాదించుకున్న సంపద వినాశ హేతువు అవుతుందని హితైషులు హెచ్చరిస్తారు. కానీ, ధృతరాష్ట్రుని బుద్ధి వేరు. ద్యూతానికి మళ్లీ వచ్చిన ఆహ్వానాన్ని ధర్మరాజు అంగీకరించడాన్ని కొందరు విమర్శిస్తారు. బంగారు లేడి ఉండదని తెలిసే, రాముడు దానిని తేవడానికి బయలుదేరినట్టు.. మాయాద్యూతమని తెలిసే, తండ్రి ఆనతి మీర లేక, ధర్మరాజు తిరిగి ఆడటానికి వస్తాడు. పరాజితులైన పాండవులతో వెళ్తున్న ద్రౌపదిని చూసి హేళన చేస్తున్న దుశ్శాసనుడిని చూసి, భీముడు ఉగ్రుడై అతడి రొమ్ము పగులగొట్టి, రక్తం తాగుతానని ప్రతిన చేస్తాడు. తన తొడను ద్రౌపదికి చూపిన దుర్యోధనుడితో తొడలు పగులగొడతానని, లేకపోతే తనకు పుణ్యగతులు కలగవని ప్రతిన చేస్తాడు. తొడలు పగులగొట్టడం యుద్ధనీతికి వ్యతిరేకమే అయినా, ధర్మబద్ధమైన ప్రతిజ్ఞా పాలన కోసం యుద్ధనీతిని అతిక్రమించవచ్చు’’ అని సామవేదం వివరించారు. పాండవులను వేదవేత్తలు అనుసరించారంటూ ఆయన వనపర్వాన్ని ప్రారంభించారు.


