వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై రేపు ఆందోళన
సామర్లకోట: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు తెలిపారు. ఇందులో రైతులు, పార్టీ శ్రేణులు, విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో మడగల రమణ అధ్యక్షతన మంగళవారం జరిగిన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేందుకే రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని అన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పు స్థలాలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకూ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. సీపీఐ ఈ నెల 26 నాటికి శత వసంతాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పార్టీ పతాకాలను ఆవిష్కరిస్తామన్నారు. కాకినాడలో ఈ నెల 27న సీపీఐ శత వసంత ముగింపు సభ జరుగుతుందని చెప్పారు. ఈ సభలో పార్టీ సీనియర్ నాయకులను సన్మానిస్తామని మధు తెలిపారు. ప్రధాని మోదీ కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించనున్నామని చెప్పారు. జనవరి 18న 5 లక్షల మంది పార్టీ కార్యకర్తలు, సానుభూతిపనులతో ఖమ్మంలో శతవార్షిక బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యుడు పెదిరెడ్ల సత్యనారాయణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.


