సహకార ఉద్యోగుల ధర్నా
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు జిల్లా సహకార కార్యాలయం వద్ద ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ఆదినారాయణ మాట్లాడుతూ, 2019 పే రివిజన్ తక్షణమే అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలని, 62 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ వయస్సు జీఓను అన్ని సహకార సంస్థల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలతో వేతన ఒప్పందం జరిగి ఏళ్లు గడుస్తున్నా అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2019లో విడుదల చేసిన జీఓ నంబర్ 36 ప్రకారం హెచ్‌ఆర్ పాలసీ అమలు చేసేంత వరకూ సహకార ఉద్యోగుల పోరాటాలు కొనసాగుతాయని చెప్పారు. ఈ నెల 22న డీసీసీబీ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. ధర్నా అనంతరం జిల్లా సహకార అధికారి శ్రీనివాసరెడ్డికి నాయకులు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, సహకార ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నరసరాజు, కోశాధికారి జి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


