సోపానం.. భక్త నీరాజనం..
● ఘనంగా సత్యదేవుని మెట్లోత్సవం
● రత్నగిరి మెట్లకు భక్తుల పూజలు
అన్నవరం: సత్యదేవుని మెట్లోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను పల్లకీ మీద రత్నగిరి దిగువకు తీసుకువచ్చి గ్రామంలో ఊరేగించారు. అనంతరం, తొలి పావంచా వద్ద స్వామివారి పాదాల మండపం వద్దకు తీసుకువచ్చి, పండితులు ప్రత్యేక పూజలు చేశారు. తరువాత కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న తొలి మెట్టును ముత్తయిదువలు పసుపు, కుంకుమ, పూలతో అలంకరించారు. పండితుల మంత్రోచ్చారణల నడుమ దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావు దంపతులు మెట్లకు పసుపు, కుంకుమలతో పూజ చేసి, కొబ్బరి కాయ కొట్టి, హారతి వెలిగించి, మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం పెద్ద సంఖ్యలో మహిళలు సత్యదేవుని ప్రధానాలయం వరకూ ఉన్న 450 మెట్లకూ పూజలు చేశారు. ప్రతి మెట్టునూ సాక్షాత్తూ సత్యదేవుని స్వరూపంగా భావించి, ఈ పూజలు నిర్వహించారు. ముత్తయిదువలు పసుపు, కుంకుమ, పూలతో ప్రతి మెట్టునూ అలంకరించగా.. పండితులు ఒక తమలపాకుపై హారతి కర్పూరం, మరో తమలపాకుపై పటిక బెల్లం నివేదించారు. భక్తులు ఆ హారతి వెలిగిస్తూ మెట్లోత్సవాన్ని కొనసాగించారు. స్వామి, అమ్మవార్లను ఆ మెట్ల మీదుగా మేళతాళాల నడుమ పల్లకీ మీద ఘనంగా ఊరేగిస్తూ ఆలయం వద్దకు తీసుకువెళ్లారు. దీంతో, మెట్ల మార్గంలో ఉత్సవ శోభ ఉట్టిపడింది. ఏటా ధనుర్మాసోత్సవాల ప్రారంభానికి ఒక రోజు ముందు సత్యదేవుని మెట్లోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ కమిషనర్ బాబూరావు, ఈఈ రామకృష్ణ, ఏఈఓలు, ఫార్మసీ సూపర్‌వైజర్ వల్లూరి మాధవి తదితర సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ఆలయ వేద పండితులు గొల్లపల్లి గణపతి ఘనపాఠి, యనమండ్ర శర్మ, గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, రమేష్, ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు, ఇతర వైదిక సిబ్బంది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మెట్లోత్సవం ముగిశాక కూడా పెద్ద సంఖ్యలో మహిళలు మెట్లను పసుపు కుంకుమలతో అలంకరించి పూజించారు. మధ్యాహ్నం వరకూ మెట్ల మార్గంలో మహిళల సందడి కనిపించింది.
నేటి నుంచి గ్రామోత్సవం
ధనుర్మాసోత్సవాల సందర్భంగా మంగళవారం నుంచి జనవరి 15 సంక్రాంతి పర్వదినం వరకూ ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ సత్యదేవుడు, అమ్మవార్లను అన్నవరం గ్రామంలో పల్లకీ మీద ఊరేగిస్తారు. కనుమ పండగ నాటి సాయంత్రం జరిగే ప్రభోత్సవంతో ధనుర్మాసోత్సవాలు ముగుస్తాయి.
సోపానం.. భక్త నీరాజనం..
సోపానం.. భక్త నీరాజనం..


