జెడ్పీలో పలువురికి ఉద్యోగోన్నతులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌లో పలువురికి ఉద్యోగోన్నతులు కల్పిస్తూ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు సోమవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. నలుగురు సీనియర్ సహాయకులకు పరిపాలనాధికారులుగా, ఐదుగురు జూనియర్ సహాయకులకు, ముగ్గురు టైపిస్ట్‌లకు సీనియర్ సహాయకులుగా, పది మంది రికార్డు అసిస్టెంట్లకు జూనియర్ సహాయకులుగా ప్రమోషన్లు ఇచ్చారు. ఒకరికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు కూడా పాల్గొన్నారు.
సత్యదేవునికి
ఘనంగా ఏకాదశి పూజలు
అన్నవరం: మార్గశిర బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర పూజ, తులసి దళాలతో సహస్ర నామార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఆలయాన్ని తెల్లవారుజామున 4 గంటలకు తెరచి సుప్రభాత సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. సత్యదేవుని ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. సత్యదేవుడు, అమ్మవారిని ముత్యాల కవచాలతో (ముత్తంగి సేవ) అలంకరించి పూజించారు.
అమరజీవి ఆత్మబలిదానంతో
ప్రత్యేక రాష్ట్రం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం ఫలితంగానే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని, ఆయన త్యాగనిరతి తెలుగు ప్రజలకు ఎప్పటికీ చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్‌లో ఆ మహనీయుని చిత్రపటానికి జేసీ సోమవారం పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ 48 రోజుల పాటు కఠోర నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు అమరులయ్యారన్నారు. ఆదర్శనీయమైన ఆయన జీవితాన్ని, అచంచల దీక్ష, పట్టుదలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎం.లల్లి, కలెక్టరేట్ ఏఓ ఎస్.రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 457 అర్జీలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 457 అర్జీలు సమర్పించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పాటు వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు జేసీ సూచించారు.
నూకాలమ్మ వారికి
రూ.7 లక్ష ఆదాయం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): స్థానిక సూర్యారావుపేటలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో హుండీలను సోమవారం లెక్కించారు. మొత్తం రూ.7,02,573 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వీర్రాజు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వడ్డి ఫణీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. సూర్యారావుపేటలోని సీతారామ మందిరంలో హుండీల ఆదాయం లెక్కించగా రూ.39,383 వచ్చిందని ఈఓ ఉండవల్లి వీర్రాజు తెలిపారు.
రేపు జాబ్ మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో బుధవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ీమెడిప్లస్ ఫార్మాలో ఫార్మసిస్ట్, ఫార్మాయిడెడ్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలకు 150 మందిని ఎంపిక చేస్తారన్నారు. అలాగే, ఎండ్రా మేధాలో 25 సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు కూడాఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఇంటర్మీడియెట్ ఆపైన ఫార్మసీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆ రోజు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించాలని కోరారు.


