నేడు ‘కోటి సంతకాల’ ర్యాలీ
● పార్టీ కేంద్ర కార్యాలయానికి
సంతకాల ప్రతుల తరలింపు
● శ్రేణులు కాకినాడ తరలి రావాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా పిలుపు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా.. జిల్లావ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులను కాకినాడ నుంచి సోమవారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం నిర్వహించామని తెలిపారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసే చంద్రబాబు కుట్రలను ప్రజలు తమ చేవ్రాలు చేయడం ద్వారా తిప్పి కొట్టారన్నారు. జిల్లావ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా స్వచ్ఛందంగా సంతకాలు చేయడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దం పడుతోందని చెప్పారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సేకరించిన ఈ సంతకాల ప్రతులను విజయవాడకు తరలించడంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ భానుగుడి సెంటర్ నుంచి బాలాజీ చెరువు సెంటర్‌లోని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి జిల్లావ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. బాలాజీ చెరువు సెంటర్ నుంచి కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనాల్లో పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తామని రాజా చెప్పారు.
పంచారామ క్షేత్రంలో హైకోర్టు న్యాయమూర్తి
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రం బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ ఆదివారం పూజలు చేశారు. ఆయనకు పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో కాలభైరవస్వామి, ధ్వజస్తంభం, పెద్ద నంది, ఉప ఆలయాలను, మూల విరాట్టు, అమ్మవారిని ఆయన దర్శించుకుని, పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు నంది మండపం వద్ద ఆయనకు ఆశీర్వచనాలు, ఆలయ అధికారి స్వామి వారి ఫొటో, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
లోవలో భక్తుల రద్దీ
తుని: తలుపులమ్మ లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ 16 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయాలకు రూ.2,00,805, పూజా టికెట్ల ద్వారా రూ.2,59,240, కేశఖండన టికెట్లకు రూ.10,200, వాహన పూజలకు రూ.10,240, కాటేజీల ద్వారా రూ.55,900, ఇతర డొనేషన్ల ద్వారా రూ.54,880, ఆన్‌లైన్ ద్వారా 17,539 కలిపి మొత్తం రూ.6,08,804 ఆదాయం సమకూరిందని వివరించారు.
21న జాతీయ
శతాధిక కవి సమ్మేళనం
అమలాపురం టౌన్: స్థానిక వడ్డిగూడెంలోని కోనసీమ రెడ్డిజన సమైక్య వేమన కమ్యూనిటీ హాలులో ఈ నెల 21న జాతీయ శతాధిక కవి సమ్మేళనం, పాటల స్వర వేదిక జరుగుతుందని శ్రీశ్రీ కళా వేదిక అంతర్జాతీయ సీఈఓ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ తెలిపారు. కవి సమ్మేళనం బ్రోచర్లను వేమన కమ్యూనిటీ హాలులో ఆయన, శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి తదితరులు ఆదివారం విడుదల చేశారు.
నేడు ‘కోటి సంతకాల’ ర్యాలీ
నేడు ‘కోటి సంతకాల’ ర్యాలీ


