ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు ఉద్యమం
ఏలేశ్వరం: ఓబీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఉద్యమం చేపడతామని తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ అన్నారు. స్థానిక వెంకటేశ్వరా ఫంక్షన్ హాలులో సంఘం జిల్లా అధ్యక్షుడు బంక కోదండ రాంబాబు అధ్యక్షతన ఆదివారం జరిగిన జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తూర్పు కాపులందరికీ ఓబీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు లేక లక్షలాది మంది ఓబీసీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలేశ్వరంలో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి స్థలం కేటాయించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బడ్డుకొండ వెంకట రమణ, కనిశెట్టి అప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి మామిడి విష్ణుమూర్తి, అలమండ చలమయ్య, శిడగం వెంకటేశ్వరరావు, సామంతుల సూర్యకుమార్, సుంకర రాంబాబు, పైల సుభాష్‌చంద్రబోస్, రిటైర్డ్ ఆర్డీఓ కోరాడ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.


