బాబు సర్కారుది దుర్మార్గం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రజలకు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని, అటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్యని పలువురు వక్తలు పేర్కొన్నారు. నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అనారోగ్యం వస్తే వెళ్లేది ప్రభుత్వ ఆసుపత్రికేనన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రజలకు అందుబాటులో ఉంటే నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తుందని, ఇది నూరుశాతం సబబు కాదని ఏకకంఠంతో ఖండించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వర్ణిక ఫంక్షన్ హాల్‌లో శనివారం ఉదయం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, ఆమ్‌ఆద్మీ పార్టీ, బీఎస్పీ, జై బీమ్ పార్టీ, 19 ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు.
ప్రజారోగ్య రంగాన్ని ఖూనీ చేయొద్దు
సమావేశంలో వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రజారోగ్య రంగాన్ని ఖూనీ చేయవద్దన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు వైద్య విద్యను దూరం చేయవద్దని, వైద్య రంగాన్ని పీ–4 పేరుతో ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టిందన్నారు. బడ్జెట్ నిధులు కేటాయించి, మెడికల్ కాలేజీలను ప్రభుత్వంలోనే కొనసాగించిందన్నారు. కానీ నేడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందన్నారు. రాష్ట్రంలో కుటుంబాలు తమ ఆదాయంలో అత్యధిక భాగాన్ని నాణ్యమైన విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం పార్టీ ప్రయోజనాల కోసం అనేక సంక్షేమ పథకాలు మంజూరు చేస్తుందని, అవి చేసినా, చేయకపోయినా పేద వాళ్లకు వైద్యాన్ని మాత్రం దూరం చేయవద్దన్నారు. ఇప్పటికే ప్రభుత్వ సామాన్య, వైద్య విధాన, ఏరియా, సీహెచ్‌సీ, పీహెచ్‌సీ ఆసుపత్రులలో మందులు, పరికరాలు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. అటువంటిది ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే ప్రైవేటు వ్యక్తులు కేవలం లాభాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తారని, దీనివల్ల మధ్యతరగతి, పేద ప్రజలకు తీవ్రతర ఇబ్బందులు వస్తాయన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఈ కళాశాలలు ఇస్తే వైద్య చికిత్సలు ఖరీదవుతాయని చెప్పారు. ప్రైవేటు వ్యక్తులు తమ పెట్టుబడిని రాబట్టుకోవడానికి రోగులపై అధిక భారాన్ని మోపుతారన్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు దోపిడీకి గురవుతారన్నారు. ఆరోగ్య విపత్తుల సమయంలో ప్రైవేటు యజమానులు సామాజిక బాధ్యత నుంచి తప్పుకుంటారని చెప్పారు. గత కోవిడ్ సమయంలో ప్రయివేటు ఆసుపత్రులు మూసివేస్తే ప్రభుత్వాసుపత్రులు మాత్రమే ఆ భారాన్ని మోశాయన్నారు.
60 ఏళ్లపాటు ప్రైవేటు సంస్థల
చేతుల్లోకి ప్రభుత్వ ఆస్తులు
మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తే ప్రభుత్వ భూములు, భవనాలు, కాలేజీలు, ఆసుపత్రులు దాదాపు 60 ఏళ్లపాటు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయని తెలిపారు. దీంతో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్య అందని ద్రాక్ష వలె మారడమే కాకుండా వైద్య విద్యలో పారదర్శకత లోపించే ప్రమాదం ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో పీపీపీ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని అనుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇది రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు. సామాజిక వర్గాల అభ్యున్నతికి భంగం కలిగించే చర్య అన్నారు. సీపీఎం సీనియర్ నాయకులు దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నంబర్ 590ను జారీ చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యానందరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అవినీతి మయంగా మారిందని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 590 ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ ప్రజా వైద్యం ప్రజల హక్కు అని ఏ దేశంలోనైనా విద్య, వైద్యం ప్రభుత్వం చేతిలోనే ఉందన్నారు. రాష్ట్రంలో మాత్రం మెడికల్ కళాశాలలను చంద్రబాబు సామాజిక వర్గానికి తాకట్టు పెట్టేందుకే ఈ ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. జై భీమ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రజారోగ్య రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీస్తోందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాగా నేడు వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణమన్నారు.
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి కే బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు కిర్ల కృష్ణారావు, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ చొల్లంగి వేణుగోపాల్, 93 కులాల ఐక్యవేదిక నాయకులు మాదిరెడ్డి గణేష్‌బాబు, గాంధీనగర్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు పరస సురేష్ కుమార్, , ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కోశాధికారి జి.రవికుమార్, ఐఎన్‌టీయూసీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి రాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా నాయకులు పలివెల వీరబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాకా రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ప్రభుత్వమే మెడికల్
కళాశాలలను నిర్వహించాలి
ప్రైవేటీకరిస్తే సహించేది లేదు
సీపీఐ రౌండ్‌టేబుల్ సమావేశంలో
వక్తల డిమాండ్
బాబు సర్కారుది దుర్మార్గం


