ఏం బ్యాగోలేవు | - | Sakshi
Sakshi News home page

ఏం బ్యాగోలేవు

Dec 13 2025 7:32 AM | Updated on Dec 13 2025 7:32 AM

ఏం బ్

ఏం బ్యాగోలేవు

శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత ప్రభుత్వం కంటే నాణ్యమైన స్కూల్‌ బ్యాగులు, బూట్లు ఇచ్చి విద్యా వ్యవస్థను పరుగులు పెట్టిస్తామని చెప్పారు. తీరా చూస్తే ఇదంతా వట్టి ప్రచారార్భాటమేననే చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకిచ్చిన స్కూల్‌ బ్యాగ్‌లను చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. ఆరు నెలలు కూడా గడవకుండానే ఇచ్చిన బ్యాగులు నాసిరకమైనవనే విషయం తేటతెల్లమైపోయింది. చాలా వరకూ బ్యాగులకు జిప్‌లు ఊడిపోతున్నాయి. చివికిపోయి, చిరిగిపోతున్నాయి. కాస్త ఎక్కువ పుస్తకాలు పెడితే బ్యాగ్‌ పూర్తిగా చిరిగిపోయి, అన్నీ నేలపైకి జారిపోయే పరిస్థితి. తమ పిల్లలకు మరీ ఇంత నాణ్యత లేని బ్యాగులను ప్రభుత్వం ఇస్తుందని అస్సలు ఊహించలేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. జిల్లాలో శుక్రవారం ఏ స్కూల్‌కు వెళ్లి పరిశీలించినా విద్యార్థుల వీపులపై నాణ్యత లేని బ్యాగులే దర్శనమిచ్చాయి. కొన్ని పాఠశాలల్లో గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంతో పాటు తాజాగా చంద్రబాబు సర్కార్‌ ఇచ్చిన స్కూల్‌ బ్యాగులతో వచ్చిన విద్యార్థులు కనిపించారు. నాడు జగన్‌ ప్రభుత్వం అందజేసిన నీలి రంగు బ్యాగులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపించాయి. అదే ఆరు నెలలు క్రితం చంద్రబాబు ప్రభుత్వం అందించిన బ్యాగులు నాణ్యత లోపానికి నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిచ్చాయి.

భారీ ఆర్భాటం

వేసవి సెలవుల అనంతరం గత జూన్‌లో ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులు అందజేస్తామని అధికార పార్టీ నేతలు చెప్పారు. మాటలైతే చెప్పారు కానీ ఆచరణలో మాత్రం జూలై నెలాఖరు వరకు కూడా బ్యాగులు ఇస్తూనే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలోని 1,280 పాఠశాలల్లో 1,28,988 మంది విద్యార్థులున్నారు. ఈ మేరకు జూన్‌ నెలలో 1,28,988 స్కూల్‌ బ్యాగుల కోసం విద్యా శాఖ ఇండెంట్‌ పెట్టింది. అయితే, జూన్‌ 20 నాటికి 20,850 బ్యాగులు మాత్రమే జిల్లాకు వచ్చాయి. అంత తక్కువగా వచ్చినా పార్టీ నేతలతో వాటిని పంపిణీ చేయడానికి భారీ ఆర్భాటమే చేశారు. మిగిలినవి కూడా జూలై రెండో వారానికి విడతల వారీగా వచ్చాయి.

వేలాది మందికి మొండిచేయి

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ స్కూల్‌ బ్యాగులు ఇవ్వడానికి బాబు సర్కార్‌కు చేతులు రాలేదని విద్యార్థి సంఘ నాయకులు ఆక్షేపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 5,600 మంది విద్యార్థులు చేరారు. వీరిలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకూ స్కూల్‌ బ్యాగులు ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండెంట్‌ పెట్టనందువల్లనే వారికి బ్యాగులు రాలేదని విద్యా శాఖ చెబుతోంది.

మూడు నెలలకే ముక్కలు

ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు నాసిరకం కావడంతో ఇచ్చిన రెండు మూడు నెలలకే చిరిగిపోయాయి. కొన్ని బ్యాగులకై తే ఎక్కడికక్కడ జిప్‌లు వదిలేశాయి. వాటికి పిన్నీసులు పెట్టుకుని విద్యార్థులు వెళ్తున్న పరిస్థితి. కొన్నింటికై తే తాళ్లు తెగిపోయాయి. దీంతో, ఆ బ్యాగుల్లో పుస్తకాలు పెట్టుకుని పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. కాస్త స్తోమత ఉన్న వారైతే తమ పిల్లలకు సొంత డబ్బులతో మార్కెట్‌లో వేరే బ్యాగులు కొంటున్నారు. ప్రతి 100 బ్యాగుల్లో 25 చిరిగిపోవడంతో వాటిని మూలన పడేసి, కొత్తవి కొనుక్కున్నామని చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా రాజకీయ సభల్లా నిర్వహించిన మెగా పేరెంట్స్‌ – టీచర్స్‌ కమిటీ సమావేశాల్లో సైతం పలువురు తల్లిదండ్రులు స్కూల్‌ బ్యాగ్‌లు చిరిగిపోయాయంటూ అసహనం వ్యక్తం చేశారు.

జగన్‌ హయాంలో నాణ్యమైన కానుక

గత జగన్‌ ప్రభుత్వ హయాంలో విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక పేరిట నాణ్యమైన బ్యాగ్‌లు, షూ, మూడు జతల యూనిఫామ్‌ రెండు జతల సాక్స్‌లు, బెల్ట్‌ అందజేశారు. అలాగే, ఆరు నుంచి పదో తరగతి వరకూ విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు, ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు పిక్టోరియల్‌ డిక్షనరీలు అందజేశారు. ఈవిధంగా జిల్లా వ్యాప్తంగా 1.59 లక్షల మందికి పైగా విద్యార్థులకు సుమారు రూ.30 కోట్ల వ్యయంతో విద్యా కానుక అందించారు.

జగన్‌ ఇచ్చిన బ్యాగే వాడుతున్నాడు

మా మనవడు ప్రవీణ్‌ కుమార్‌ తాళ్లూరు హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన స్కూల్‌ బ్యాగ్‌ జిప్‌లు ఊడిపోయాయి. అక్కడక్కడ బ్యాగ్‌ చిరిగిపోయింది. దీంతో, దానిని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన స్కూల్‌ బ్యాగ్‌ ఇప్పటికీ బాగుంది. ఆ బ్యాగ్‌లోనే మా మనమడు పుస్తకాలు పెట్టుకుని స్కూల్‌కు వెళ్తున్నాడు.

– బూరా అబ్బులు, తాళ్లూరు, గండేపల్లి మండలం

6 నెలలు గడవకుండానే..

ఆరు నెలలు కూడా గడవకుండానే చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు చిరిగిపోయాయి. ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులు స్కూళ్లకు పరిశీలనకు వెళ్లినప్పుడు విద్యార్థులు వద్ద చిరిగిన బ్యాగులు చూశాం. కొత్తగా చేరిన విద్యార్థులకు ఈ రోజుకు కూడా బ్యాగులు ఇవ్వలేదు. టీచర్స్‌ – పేరెంట్స్‌ మీటింగ్‌లో కూడా తల్లిదండ్రులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలు రాకూడదంటూ సర్కులర్‌ జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇంకోవైపు పాఠశాలల్లో జరిగిన పేరెంట్స్‌ – టీచర్స్‌ సమావేశాలకు పార్టీ కార్యకర్తలను పంపించి రాజకీయ ప్రసంగాలు ఇప్పించింది. విద్యార్థి సంఘాల కార్యకలాపాలు, జెండాలు వద్దని చెబుతూనే వారి పార్టీ కార్యకర్తలతో ఈ సమావేశాలు నిర్వహించారు.

– సీహెచ్‌ లోవరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ

విద్యార్థులకు నాసిరకం

స్కూల్‌ బ్యాగుల పంపిణీ

జిప్పులు ఊడిపోయి, చిరిగిపోయిన వైనం

ఆర్భాటం గొప్ప.. నాణ్యత దిబ్బ

అంటూ విమర్శలు

ఏం బ్యాగోలేవు1
1/6

ఏం బ్యాగోలేవు

ఏం బ్యాగోలేవు2
2/6

ఏం బ్యాగోలేవు

ఏం బ్యాగోలేవు3
3/6

ఏం బ్యాగోలేవు

ఏం బ్యాగోలేవు4
4/6

ఏం బ్యాగోలేవు

ఏం బ్యాగోలేవు5
5/6

ఏం బ్యాగోలేవు

ఏం బ్యాగోలేవు6
6/6

ఏం బ్యాగోలేవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement