బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 28న రావులపాలెం సమీపంలోని ఈతకోట గ్రామంలో నిర్వహించే బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడలో బీసీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు నివాసంలో శుక్రవారం బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ జరిగింది. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రిజర్వేషన్లను పెంచి ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలన్నారు. సమగ్ర కులగణన చేయాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునః సమీక్షించాలన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రి గోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాకిరెడ్డి భాస్కర్ గణేష్‌బాబు మాట్లాడుతూ బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. సమావేశంలో యనమదల రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు, మట్టపర్తి సూర్యచంద్రరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి భీమరాజు, రాయుడు సుధాకరరావు, పంపన రామకృష్ణ, బీసీ చైతన్య వేదిక నాయకులు పెంకే రాజు, పెంకే శివ, పెంకే వెంకటలక్ష్మి పాల్గొన్నారు.


