కార్మిక మంత్రికి మా గోడు వినిపించదా?
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కార్మిక శాఖ మంత్రికి భవన నిర్మాణ కార్మికుల గోడు వినిపించదా అని ఏపీ బిల్డింగ్, కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక పీఆర్ భవన్‌లో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికులకు బతుకు భారమైందని, సొంత ఊర్లో పనులు లేక వలసలు వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.110 కోట్ల భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ కై ్లమ్ ఉన్నాయని, తక్షణమే విడుదల చేయాలని అనేకసార్లు వినతి పత్రం అందజేసినా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కార్మికులకు పథకాల అమలు చేయాలంటే నిధులు లేవని కానీ స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో రూ.70 కోట్లు విడుదల చేస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు తానువ్యతిరేకం కాదని, కానీ భవన నిర్మాణ కార్మికుల కోసం చెల్లిస్తున్న సెస్ నిధులు ఖర్చు చేయకుండా ప్రభుత్వ నిధులు కేటాయించి స్కిల్ డెవలప్‌మెంట్ చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘాలను, కలిసొచ్చే ఇతర సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు తాటిపాక మధు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటాలు చేయాలన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాల అమలుపై భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. సదస్సులో ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కె.సత్తిబాబు, అమలాపురం యూనియన్ అధ్యక్షుడు బోనం చిన్న, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కె.రాంబాబు పాల్గొన్నారు.
ఏపీ బిల్డింగ్, కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్
యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ


